ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంలో శ్రీలంక యువ పేసర్ మతీశా పతిరన మతిపోయే ధరకు అమ్ముడయ్యాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అతడిని రూ.18 కోట్లకు సొంతం చేసుకుంది. ‘బేబీ మలింగా’ కోసం కోల్‌కతాతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీపడ్డాయి. అత్యధిక పర్స్ వాల్యూ ఉన్న కేకేఆర్ మతీశా పతిరన కోసం వెనక్కి తగ్గకుండా బిడ్ వేసి.. భారీ ధరకు కొనుగోలు చేసింది. పతిరన కనీస ధర రూ.2 కోట్లు. కామెరూన్ గ్రీన్‌ను కేకేఆర్ రూ.25.2 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే.
శ్రీలంకకు చెందిన మతీశా పతిరన విలక్షణమైన బౌలింగ్ యాక్షన్‌తో ప్రసిద్ధి చెందాడు. లసిత్ మలింగా లాగా అతడి బౌలింగ్ శైలి ఉంటుంది. పతిరన శ్రీలంకలో ఫేమస్ అయ్యాడో లేదో కానీ.. ఐపీఎల్ ద్వారానే అతడు ప్రపంచానికి పరిచయం అయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. కుర్రాళ్లకు అండగా నిలిచే ఎంఎస్ ధోనీ.. నీడలో ఎదిగాడు. పతిరనను స్టార్‌గా మార్చింది ధోనీనే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీలంక అండర్ -19 జట్టు, అబుదాబి టీ10 టోర్నీలో ఆకట్టుకున్న పతిరన.. ఐపీఎల్ 2022లో ఎంట్రీ ఇచ్చాడు.
Also Read: IPL Auction 2026: టాప్ స్టార్లకు తప్పని నిరాశ.. అన్‌సోల్డ్ లిస్ట్ పెద్దదే గురూ!
2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలవడంలో మతీశా పతిరన కీలక పాత్ర పోషించాడు. 2023 ఎడిషన్‌లో 12 మ్యాచుల్లో 19 వికెట్లు పడగొట్టాడు. 2024లో ఆరు మ్యాచులే ఆడాడు. గాయం కారణంగా మిగతా మ్యాచులు ఆడలేదు. పతిరనపై నమ్మకం ఉంచిన సీఎస్కే.. రూ.13 కోట్లతో రిటైన్ చేసుకుంది. అయితే 2025 సీజన్‌లో నిరాశపరిచాడు. 12 మ్యాచ్‌ల్లో 10.13 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. దాంతో అతడిని చెన్నై వేలంలోకి వదిలేసింది. ఐపీఎల్ 2026లో కోల్‌కతా తరఫున ఆడనున్నాడు.
