Site icon NTV Telugu

అయ్యయ్యో వద్దమ్మా… ‘కవర్’ అలా వాడొద్దు

దేశవ్యాప్తంగా రోజురోజుకు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి జాబితా పెరిగిపోతోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా కొందరు కేటుగాళ్లు మాత్రం ట్రాఫిక్ నియమాలను పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ జంట ఫోటోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల విభాగం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సదరు ఫోటోలో బైక్ వెనుక కూర్చున్న మహిళ తన తలకు హెల్మెట్ ధరించడానికి బదులు పాలిథిన్ కవర్‌ను చుట్టుకుంది.

Read Also: ఖేల్ రత్న, అర్జున అవార్డులకు ఎంపికైంది వీరే

దీంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సదరు మహిళను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘హెల్మెట్ ఫుల్ కవర్ అయి ఉండాలి అన్నారు కానీ కవర్‌ని హెల్మెట్‌లా వాడమనలేదు’ అని ఆ ట్వీట్‌లో పేర్కొంది. దీంతో సైబరాబాద్ పోలీసులు పోస్ట్ చేసిన ఫోటో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ట్రాఫిక్ పోలీసుల నిబంధనల ప్రకారం బైక్‌పై వెళ్లేటప్పుడు పిలియన్ రైడర్ (బైక్ వెనుక కూర్చునేవారు) కూడా తప్పకుండా హెల్మెట్ ధరించాలి. ఒకవేళ హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యం వహిస్తే మీ వాహనానికి ట్రాఫిక్ ఛలానా తప్పదు.

Exit mobile version