రాజేంద్రనగర్ హైదర్ షా కోట్ కస్తూర్భా గాంధీ ఆశ్రమం నుండి 14 మంది మహిళలు పరారవడం సంచలనంగా మారింది. నిన్న అర్థరాత్రి 2 గంటల సమయంలో కిటికీ అద్దాలు పగలగొట్టి పరారయ్యారు మహిళలు. పేటా కేసులో మహిళలను ఆశ్రమానికి తరలించారు పోలీసులు. మహిళల పరారీ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగి పోలీసులు.
సైబరాబాద్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న పలు గృహాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ రెస్క్యూ టీమ్ దాడులు చేసింది. అందులో ఉన్న 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 19 – 25 సంవత్సరాల వయసు గల మహిళలను కోర్టు ఆదేశంతో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళా అనాథాశ్రమంలో చేర్పించారు. వీరి పరివర్తనలో మార్పు తేవాలని, సమాజంలో గౌరవంగా బతికేలా చేయాలని వీరికి అక్కడ 20 రోజులుగా తర్ఫీదు ఇస్తున్నారు.
అయితే శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ 14 మంది మహిళలు పక్కా ప్లాన్ వేసి ఆశ్రమంలోని బాత్‌రూం వెంటిలేటర్ విరగ్గొట్టి, ప్రహరీ గోడను సైతం దూకి పారిపోయారు. ఉదయం వీరు లేకపోవడంతో సీసీ ఫుటేజీలు పరిశీలించగా ఈ సంఘటన బయటపడింది. ఆశ్రమం నిర్వాహకులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరు ఎక్కడికి వెళ్లారనేది దర్యాప్తులో తేలనుంది.
