భార్యభర్తలంటే కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా వుండాలంటారు. జీవితాంతం కలిసి వుంటామని బాసలు చేసుకుంటారు. ఒకరికి కష్టం వస్తే మరొకరు అల్లాడిపోతారు. ఒకరు కన్నుమూస్తే.. మరొకరి గుండె కూడా విశ్రాంతి తీసుకుని వారి దగ్గరే వెళ్ళిపోతుంటుంది. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. సినిమాల్లో మనం ఇలాంటివి చూసి కన్నీళ్ళు పెట్టుకుంటాం. కానీ గుండెపోటుతో భార్య మృతి చెందిన కాసేపటికే భర్త కన్నుమూసిన ఘటన కన్నీళ్ళు తెప్పించింది.
తిరిగి రాని లోకాలకు చేరిన భార్య మృతదేహాన్ని చూస్తూ విలపించిన భర్త గుండె కూడా ఆగిపోయింది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న ఇద్దరు వృద్ధ దంపతులు గంట వ్యవధిలో కన్నుమూసిన సంఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ తిరిగారా దంపతులు. ఆరోగ్యంగా ఉన్న దంపతులు గంట వ్యవధిలోనే చనిపోయారు. గుండెపోటుతో భార్య కుప్పకూలింది. తన అర్థాంగి లేని జీవితం నాకెందుకు అనుకున్నాడేమో ఆ భర్త కూడా గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచాడు.
ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ద్వారకాపేట గ్రామానికి చెందిన మాసపత్రి రాజయ్య (70) జిల్లా కేంద్రంలోని సింగరేణి సంస్థలో ట్రామర్గా చేసి 2017లో ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు భార్య సావిత్రి (65) నలుగురు కుమారులున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్లో రాజయ్య దంపతులకు బంధువులు ఉండడంతో ఐదేళ్ల క్రితం ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటున్నారు.
శుక్రవారం ఉదయం స్వరూపకు గుండెపోటు రావడంతో కిందపడిపోయారు. చుట్టుపక్కలవారు ఇంటికొచ్చి చూసేసరికి ఆమె కన్నుమూశారు. భార్య మృతిని తట్టుకోలేక రోదించిన రాజయ్యకు కూడా గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు స్థానిక వెంకటాపూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్ప టికే ఆయన మృతి చెందారని తెలిపారు. ఇద్దరి అంత్యక్రియలు ఓకే సారి నిర్వహించారు. ఈ విషయం తెలిసిన బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. రాజయ్య, సావిత్రి ఒకరికోసం ఒకరు పుట్టినట్టుగా.. చావులోనూ ఇద్దరూ తమ అన్యోన్యతను చాటుకున్నారు.