NTV Telugu Site icon

ప‌టేల్ వ‌ర్గంవైపే బీజేపీ అధిష్టానం మొగ్గు… ఎందుకంటే…

గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ ఈరోజు రాజీనామా చేశారు.  అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో పాటుగా, కొత్త వారికి అవ‌కాశం ఇవ్వాల‌నే త‌లంపుతో తాను రాజీనామా చేసిన‌ట్టు పేర్కొన్నారు.  ఐదేళ్ల‌పాటు ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు.  మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు ఉన్నాయి అన‌గా ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.  ఆయ‌న త‌ప్పుకోవ‌డానికి ప‌టేల్ వ‌ర్గం వ్య‌తిరేఖ‌తే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.  గుజ‌రాత్‌లో ప‌టేల్ వ‌ర్గీయులు పెద్ద సంఖ్య‌లో ఉన్నారు.  వీరి ఓటు బ్యాంకింగ్ ఏ పార్టీకైనా స‌రే చాలా అవ‌స‌రం.  2017లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌టేల్ వ‌ర్గం వ్య‌తిరేఖ‌త కార‌ణంగా బీజేపీ ఓటు బ్యాంకు ప‌డిపోయింది.  99 సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌యింది.  ప‌టేల్ వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని పెద్ద ఉద్య‌మ‌మే చేశారు.  కాగా, గుజ‌రాత్‌లో కొంత రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డంతో ఆ వ‌ర్గం కాస్త శాంతించింది.  అయిన‌ప్ప‌టికీ అయితే, కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ప‌టేల్ వ‌ర్గానికి ద‌గ్గ‌ర కావాల‌ని చూస్తుండ‌టంతో బీజేపీ అధిష్టానం ముందుగానే మేల్కొని ప‌టేల్ వ‌ర్గానికి చెందిన నేత‌ను ముఖ్య‌మంత్రిగా చేయాల‌ని చూస్తున్న‌ది.  గుజ‌రాత్ ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న నితిన్ ప‌టేల్‌, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి ఆర్‌సీ ఫాల్దుతో పాటుగా కేంద్ర మంత్రులుగా ఉన్న మ‌న్‌షుక్ మాండ‌వీయ‌, పురుషోత్తం రూపాలా పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చాయి.  రాష్ట్ర రాజ‌కీయాల్లో ప‌ట్టున్న నితిన్ ప‌టేల్‌కు ప‌ద‌వీబాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశం ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.  ఒక‌వేళ నితిన్ ప‌టేల్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే ప‌టేల్ వ‌ర్గీయుల‌ను ఏ మేర‌కు ఆయ‌న ఆక‌ర్షిస్తారో చూడాలి.  

Read: యూపీలో దూకుడు పెంచుతున్న కాంగ్రెస్‌…పాద‌యాత్ర‌కు సిద్ధం…