NTV Telugu Site icon

చిరంజీవికి జరిగిందే గుణశేఖర్ కూ జరిగింది!?

చిరంజీవి ఆ మధ్య తనకు కరోనా వచ్చిందని, తనను కలిసిన వాళ్ళంతా పరీక్షలు చేయించుకోమని ప్రకటించారు. అయితే… ఎలాంటి అనారోగ్య లక్షణాలు రెండు మూడు రోజులైనా కనిపించకపోవడంతో ఆయన మళ్ళీ మరో రెండు చోట్ల టెస్టులు చేయించుకుంటే కరోనా సోకలేదని తెలిసింది. దాంతో తిరిగి ఈ విషయాన్ని జనానికి సోషల్ మీడియా మీద తెలియచేశారు.

తాజాగా ఇలాంటి సంఘటనే ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ విషయంలోనూ జరిగింది. సమంత నాయికగా ఆయన దాదాపు ఇరవై రోజులుగా ‘శాకుంతలం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో బిగ్ బాస్ హౌస్ వేసిన స్థలంలోనే ‘శాకుంతలం’ కోసం ఓ భారీ సెట్ ను వేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ స్పాట్ లోనూ రెండు మూడు రోజులకు ఒకసారి యూనిట్ సభ్యులకు కరోనా టెస్టులు చేస్తున్నారు. ఇలా సోమవారం చేసిన కరోనా టెస్టుల్లో దర్శకుడు గుణశేఖర్ కు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. దాంతో షూటింగ్ ను ఆపేశారు. మంగళవారం షూటింగ్ నూ రద్దు చేశారు. కానీ తనకు కరోనా లక్షణాలు ఏవీ లేకపోవడంతో మరోసారి గుణశేఖర్ డాక్టర్ల సమక్షంలో మంగళవారం కోవిడ్ 19 పరీక్షలు చేయించుకున్నారట. అయితే… ఈసారి ఆయనకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందట. ఈ విషయాన్ని గుణశేఖరే స్వయంగా ట్వీట్ చేశారు. గుణశేఖర్ కు కరోనా లేదని తెలియడంతో యూనిట్ సభ్యులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం నుండి ‘శాకుంతలం’ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లోని సెట్ లో జరుగబోతోంది.