NTV Telugu Site icon

వరంగల్ బాలుడికి అరుదైన అవకాశం

image courtesy: TOI

వరంగల్‌కు చెందిన ఓ బాలుడు అరుదైన అవకాశం పొందాడు. టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్ స్థాపించిన ఇంటర్నేషనల్‌ స్కూల్లో చదివేందుకు ఆ బాలుడు అర్హత సాధించాడు. వివరాల్లోకి వెళ్తే… వరంగల్ పట్టణంలోని గోపాలపూర్‌లో నివసిస్తున్న అనిక్ పాల్ ప్రస్తుతం ఆరో తగరతి చదువుతున్నాడు. వరంగల్ నిట్‌ సమీపంలోని గవర్నమెంట్ ఆర్‌ఈసీ పాఠక్‌ స్కూలులో అతడు అభ్యసిస్తున్నాడు. అయితే అనిక్ పాల్‌లో టాలెంట్‌ను గుర్తించిన అతడి తండ్రి విజయ్ పాల్.. ఎలన్ మస్క్ స్థాపించిన సింథిసిస్ స్కూలు గొప్పతనాన్ని తెలుసుకుని అందులోని చేర్పించాలని నిర్ణయించుకున్నాడు.

Read Also: బిగ్‌బాస్-5: అప్పుడు హోస్ట్… ఇప్పుడు గెస్ట్

అత్యున్నత ప్రమాణాలు కలిగిన అమెరికాలోని సింథసిస్ స్కూలులో చేరాలంటే విద్యార్థికి ప్రత్యేక నైపుణ్యాలు ఉండాలి. ఈ నేపథ్యంలో ఎంట్రన్స్ టెస్ట్ మూడు లెవల్స్‌లో ఉంటుంది. సింథసిస్‌ స్కూల్ మేనేజ్ మెంట్ వీడియోలు, గేమ్స్‌ రూపంలో ప్రశ్నలను ఇచ్చి వాటిని విద్యార్థులు ఎలా జవాబు ఇస్తున్నారన్న విషయాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత ఓ సమస్యకు వివరణాత్మకంగా సమాధానం ఇస్తూ వీడియోను పంపాలి. అనంతరం ఫేస్‌ టు ఫేస్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటన్నింటిలోనూ అనిక్ పాల్ పాసయ్యాడు. దీంతో బాలుడి నైపుణ్యాలు మెచ్చిన సింథసిస్‌ యాజమాన్యం అనిక్‌ పాల్‌కు ఆరో తరగతిలో ప్రవేశం కల్పించింది. కాగా కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత తన కుమారుడిని అమెరికా పంపిస్తామని అనిల్ పాల్ తండ్రి విజయ్ పాల్ తెలిపాడు. ఆయన ప్రస్తుతం గవర్నమెంట్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.