ఈమధ్యకాలంలో ప్రజాప్రతినిధులు కొందరు ప్రజలతో మమేకం అవుతున్నారు. ఆనందంగా డ్యాన్స్ లు వేస్తున్నారు. తాజాగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డప్పుతో దరువేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. వికారాబాద్ జిల్లాలోని ధారూర్ మండలం అంపల్లి గ్రామంలో ఒగ్గుడోలు శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ఒగ్గు కళాకారులతో కలిసి డోలు వాయించి దరువేశారు. కళాకారులతో పాటు ఆయన కూడా డప్పుతో చిందులేసి సందడి చేశారు. దీంతో అక్కడ ఉన్న వారంతా కేకలు వేస్తూ ఎమ్మెల్యే ఆనంద్‌ను అభినందించారు.
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. జిల్లాలో ఒగ్గుడోలు శిక్షణ జరగడం అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో సంప్రదాయ కళలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. రోజురోజుకీ అంతరించి పోతున్న గ్రామీణ కళలను మళ్లీ బతికించాలని ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఈ ఉద్దేశంతోనే ఈ కళలను ప్రోత్సహించడం జరిగుతోందని తెలిపారు. ఒగ్గు కళాకారులతో పాటు టీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బిజీబిజీగా ఉండే ఎమ్మెల్యే డప్పుతో దరువేయడం, తమతో కలిసి పోవడంపై కళాకారులు ఖుషీ అయ్యారు.