మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలు మానేసి మంచి పని చేశారని… రాజకీయాలు మాట్లాడే భాష అస్సలు బాగోలేదని..ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన యోధ లైఫ్ లైన్ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి, క్రికెటర్ అజారుద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.
ఉపరాష్ట్రపతి పదవి వల్ల కొంచం తొందరగా పడుకుంటున్నానని.. కానీ ప్రజలకు దూరంగా ఉండటం కొంచం ఇబ్బంది గా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి కావాలని తనకేం కోరిక లేదని…చిరంజీవి లాంటి ఎంతో మంది శ్రేయోభిలాషుల కోరిక అని పేర్కొన్నారు.రాజకీయం మీద తనకు ఆసక్తి లేదని… ఇప్పుడు పరిణామాలు చూస్తే తనకు రాజకీయం నచ్చడం లేదన్నారు. ఇంకా కరోనా పోలేదని… ఏదో ఒక వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. కరోనా నిబంధనలు పాటించాలన్నారు. మోడీ, కేసీఆర్ ల కోసం కాకుండా మన కోసం రూల్స్ పాటించాలని కోరారు వెంకయ్య నాయుడు.
