Site icon NTV Telugu

పెట్రో ధరల తగ్గింపు చర్యలు.. కేంద్రం కీలక ప్రకటన..!

పెట్రో ధరల మంట సామాన్యుడికి భారంగా మారిపోతోంది.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు క్రమంగా పైకి ఎగబాకుతుండడంతో.. నిత్యావసరాలు మొదలు, ఇతర వస్తువలపై కూడా దాని ప్రభావం క్రమంగా పెరుగుతూనే ఉంది. అయితే, పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే అందరికీ ఉపశమనం కలుగుతుందనే చర్చ ఎప్పటి నుంచూ జరుగుతూనే ఉంది.. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశమైన ప్రతీసారి.. ఇక, ఈ సారి.. చమురు ధరలు జీఎస్టీ పరిధిలోకి వస్తాయనే ప్రచారం కూడా సాగుతూ వచ్చింది. అయితే, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించే విషయమై ఆర్థిక శాఖతో చర్చలు జరుపుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి.. ఇంధన ధరలను అదుపు చేయాల్సి ఉంటుందని.. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని తెలిపాయి.

మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్‌ ధరను 70 డాలర్ల కన్నా దిగువకు తీసుకురావాల్సి ఉందని చెబుతున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు.. దీని కోసం సౌదీ అరేబియా మొదలు రష్యా వరకు చమురు ఉత్పత్తి దేశాలతో పెట్రోలియం మినిస్ట్రీ సంప్రదింపులు జరుపుతూనే ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.. కాగా, వరుసగా పెరుగుతోన్న పెట్రో ధరలు రోజుకో రికార్డు తరహాలో.. ఆల్‌ టైం హైకి చేరుకున్న సంగతి తెలిసిందే. పెట్రోల్‌ బంకుకు వెళ్లాలంటేనే సామాన్యుడు వణికిపోయే పరిస్థితి వచ్చింది. పెట్రో మంటపై కేంద్రంపై క్రమంగా విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి.

Exit mobile version