నేచురల్ స్టార్ నాని 25వ చిత్రం ‘వి’ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యింది. సరిగ్గా యేడాది తర్వాత మళ్ళీ అందులోనే ‘టక్ జగదీశ్’ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటరా? ఓటీటీనా? అనేది తేల్చుకోలేక కొన్ని నెలల పాటు సతమతమైన నిర్మాతలు సాహు గారపాటి, హరీశ్ పెద్ది చివరకు ఓటీటీ వైపే మొగ్గు చూపారు. దాంతో ఎగ్జిబిటర్స్ నుండి కాస్తంత వ్యతిరేకత ఎదురైనా… వెనక్కి తగ్గకుండా వినాయక చవితి కానుకగా ‘టక్ జగదీశ్’ను వ్యూవర్స్ ముందుకు తీసుకొచ్చారు. నాని ‘నిన్ను కోరి’తో తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్న శివ నిర్వాణ ‘మజలి’ సక్సెస్ తర్వాత తెరకెక్కించిన సినిమా ఇదే కావడం విశేషం.
ఎవరికైనా విపరీతమైన సహనం ఉంటే భూదేవితో పోల్చుతారు. కానీ చిత్రంగా భూదేవిపురంలోని జనాలకు మాత్రం సహనం తక్కువ. ఒకరిని ఒకరు హత్య చేసేంత ఆవేశకావేశాలు ఎక్కువ. మరీ ముఖ్యంగా ఆస్తి కోసం సొంత అన్నదమ్ములే కత్తులు దూసుకునే పరిస్థితి. ఆ వూరి పెద్ద ఆదిశేషు నాయుడు (నాజర్) కక్షలు, కార్పణ్యాలు లేని భూదేవి పురాన్ని చూడాలని కలలు కంటాడు. ఇద్దరు భార్యల ద్వారా ఐదుగురు పిల్లల్ని పొందిన ఆయనకు ఉమ్మడి కుటుంబమంటే ప్రాణం… కొడుకులతో పాటు కూతుళ్ళు అల్లుళ్ళను తనతోనే ఉంచుకుంటాడు. ఊరి పంచాయితీలో తన తండ్రి హత్యకు గురికావడానికి ఆదిశేషు నాయుడే కారణమని భావించే వీరేంద్ర (డేనియల్ బాలాజీ)కు నాయుడి కుటుంబమంటే గిట్టదు. అలాంటి ఈ రెండు కుటుంబాలు నాటకీయంగా ఎలా కలిశాయి? ఊరంతా దేవుడిగా కొలిచే ఆదిశేషు నాయుడు కుటుంబం ఆయన మరణానంతరం ఎలా చిన్నాభిన్నమైంది? దాన్ని ఆయన చిన్న కొడుకు టక్ జగదీశ్ (నాని) ఎలా సెట్ చేశాడు? అనేదే ఈ సినిమా.
ఉమ్మడి కుటుంబాలు ఆస్తి కోసం విడిపోవడాలు, అన్నదమ్ముల మధ్య సైతం అపార్థాలు చోటు చేసుకోవడాలు చాలా కామన్. అయితే… ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ముల మధ్య కూడా వైరం రావడం, తండ్రి ఉన్నప్పుడు ఒకలా మరణానంతరం మరోలా పెద్ద కొడుకు బిహేవ్ చేయడం అనేది ఇందులో కాస్తంత కొత్తగా ఉంది. అలానే తల్లీ, ఆమె కన్న పిల్లల విషయంలోనూ ప్రేక్షకుల ఊహకు అందని మలుపుల్ని పెట్టి దర్శకుడు శివ నిర్వాణ పరీక్షపెట్టాడు. గ్రామం… అందులోని పెద్దల మధ్య ఉండే కనిపించని వైరం, దానిని తీర్చుకోవడానికి ఎత్తులు జిత్తులూ వేయడం మామూలే. ఆ తరహా సన్నివేశాలూ ఇందులో ఉన్నాయి. ఇక హీరోకు కుటుంబంతో ఉండే అనుబంధాన్ని, హీరోయిన్ తో అతను సాగించే ప్రేమాయణం షరా మామూలే. కుటుంబమంటే ప్రాణంగా భావించే కథానాయకుడు… ఆ కుటుంబంలో తానే ఏకాకిని అని తెలిసినప్పుడు పడే మధన మాత్రం ప్రేక్షకులను కదిలిస్తుంది. చివరకు ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా ‘టక్ జగదీశ్’ మూవీ ముగుస్తుంది.
అయితే ఇందులోని చాలా సన్నివేశాలు సినిమాటిక్ గా ఉన్నాయి. ఉమ్మడి కుటుంబంలోని ఆప్యాయానురాగాలను ఓ పక్క చూపిస్తూనే, ఆస్తి విషయానికి వచ్చే సరికీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళలో గూడుకట్టుకున్న స్వార్థం ఎలా బయట పడుతుందో చూపించారు. సో… అంతకు ముందు చూపించిన ప్రేమంతా బూటకమన్నట్టేగా! ఇక నాయుడు గారి పెంపకం, ఆయన గొప్పతనం పిల్లలకు ఏం అబ్బినట్టు!! అదే విధంగా ఆస్తి ఒకరి చేతి నుండి మరో చేతిలోకి మారిపోగానే సొంత మనుషులే ఠక్కున ప్లేట్ ఫిరాయించడం అనేది కూడా ప్రేక్షకులు జీర్ణించుకోలేనేదే! పైగా సినిమా క్లయిమాక్స్ కు చేరువ అయిన తర్వాత జరిగే ఈ తతంగంతో మరింత కన్ ఫ్యూజ్ అవుతారు. ఇక హీరో మేనమామ విదేశాల నుండి హఠాత్తుగా రావడం, అప్పటి వరకూ ఉన్న సమస్యను కొత్త మలుపు తిప్పడం చిత్రంగా అనిపిస్తుంది. అలానే మేనకోడలు అత్తవారింట్లో ఎలా ఉందో తెలుసుకోవడం కోసం హీరో ప్రతి రాత్రి ఆ ఇంటి ముందు పడిగాపులు పడటం కామెడీగా ఉంది. ఇక హీరో తన ఉద్యోగ బాధ్యతను మించి విడిపోయిన కుటుంబాలను కలపాలని కంకణం కట్టుకోవడం, అందులో భాగంగా ఓ ఇంటికి భోజనానికి వెళ్ళి అక్కడి వారికి క్లాస్ పీకడం… హీరో క్లాస్ కే సంవత్సరాల తరబడి ఉన్న వైరాన్ని మరిచి కలసి పోవడం ఇలాంటి సినిమాల్లోనే సాధ్యమేమో. శివ నిర్వాణ గతంలో తీసిన ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ సినిమాలోనూ పాత చిత్రాలలోని సన్నివేశాలు మనకు అనేకం కనిపిస్తాయి. ఇది కూడా ఓ రకంగా అలాంటిదే.
నేచురల్ స్టార్ అనే బిరుదును నాని ‘టక్ జగదీశ్’ పాత్రతో మరోసారి సార్థకం చేసుకున్నాడు. తండ్రికి ఇష్టుడైన పెద్ద భార్య రెండో కొడుకుగానే కాకుండా ఆయన లక్షణాలను పుణికి పుచ్చుకుని ఊరి జనం కోసం పాటు పడే వ్యక్తిగా మెప్పించాడు. ద్వితీయార్థంలో హీరో కెరీర్ కు సంబంధించిన ట్విస్ట్ బాగుంది. తాను ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే కుటుంబ సభ్యులే తనను అపార్థం చేసుకున్నప్పుడు నాని చూపించిన హావభావాలు ఆకట్టుకుంటాయి. అయితే పాత్ర కోసం స్లోగా మాట్లాడినట్లు చూపించటం అభిమానులకే కాదు ప్రేక్షకుల సహనానికి కూడా పరీక్షే. సినిమాలో నాని తన మనసులోని భావాన్ని వ్యక్తం చేసిన దానికంటే… చేతలతో చూపించిందే ఎక్కువ. నాని అన్న బోస్ బాబుగా జగపతిబాబు డబుల్ షేడ్స్ ఉన్న పాత్రను చేసి మెప్పించాడు. హీరో తండ్రిగా చేసిన నాజర్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. వీరేంద్రగా తమిళనటుడు డేనియల్ బాలాజీ నటించగా, అతని తమ్ముడిగా తిరువీర్ నటించాడు. హీరో అక్కలుగా రోహిణి, దేవదర్శిని; వారి భర్తలుగా రావు రమేశ్, నరేశ్ నటించారు. ఈ ఇద్దరికీ తమ నటనను ప్రదర్శించడానికి దర్శకుడు అంత స్కోప్ ఇవ్వలేదు. హీరో తల్లిగా మలయాళ నటి మాల పార్వతిని మన ఆడియన్స్ ఓన్ చేసుకోలేరు. ఆమె పాత్రలో కుంతిదేవి లక్షణాలను దర్శకుడు చూపించాడు. హీరో మేనకోడలుగా ఐశ్వర్యా రాజేశ్ తన నటనతో మెప్పించింది. ఇటీవలే ‘శ్రీదేవి సోడా సెంటర్’లో హీరోయిన్ తల్లిగా కనిపించిన టీవీ నటి కళ్యాణీ రాజ్ ఇందులో వీరేంద్ర భార్యగా కనిపించింది. హీరోయిన్ గుమ్మడి వరలక్ష్మి పాత్రలో రీతువర్మ ఒదిగి పోయింది. ఆమె చేసే ఉద్యోగానికి ఆ వేషధారణకు అసలు ఎక్కడా పొంతన లేదు. హీరోకి అదే ప్రత్యేకంగా కనిపించి ప్రేమలో పడతాడు కాబట్టి మనమేమీ చేయలేం!
ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ బాగుంది. పోరాట సన్నివేశాలనూ ఆసక్తికరంగా మలిచారు. దర్శకుడు శివ నిర్వాణ రాసిన సంభాషణలు మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూర్చగా, గోపీసుందర్ నేపథ్య సంగీతం అందించారు. అయితే… థియేట్రికల్ రిలీజ్ అయి ఉంటే… నేపథ్య సంగీతం ఎలివేట్ అయిఉండేదేమో కానీ… బుల్లితెరలో చూడటంతో ఆ ప్రభావం కనిపించలేదు. పాటల సాహిత్యం అర్థవంతంగా ఉంది కానీ హమ్మింగ్ చేసుకునే పాట ఒక్కటీ లేదు. ఇటీవల కాలంలో తమన్ పాట ఒక్కటీ ఆకట్టుకోక పోవడం ఇదే కావచ్చు. నిజానికి పాటలు గోపీ సుందర్ తో చేయించి నేపథ్య సంగీతం తమన్ తో చేయించాలి. రివర్స్ చేయటంతో సినిమాపై ప్రభావం బాగానే పడింది. ఓవర్ ఆల్ గా ఈ ఫ్యామిలీ డ్రామాలో సెంటిమెంట్ మసాలా చాలా ఎక్కువైంది. థియేట్రికల్ రిలీజ్ అయి ఉంటే నూటికి నూరు శాతం ఫలితం ప్రతికూలంగా ఉండేదే! బహుశా దానిని గ్రహించే ఓటీటీలో నిర్మాతలు దీనిని రిలీజ్ చేసి ఉండొచ్చు. ఏదేమైనా… పండగ రోజు భారీ అంచనాలు పెట్టుకుని ఫ్యామిలీతో సినిమా చూసినవారికి పూర్తిగా నిరాశే కలుగుతుంది.
రేటింగ్: 2.25/5
ప్లస్ పాయింట్
నాని నటన
ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ
నిర్మాణ విలువలు
మైనెస్ పాయింట్
రొటీన్ ఓల్డ్ స్టోరీ కావడం
ఆసక్తి కలిగించని కథనం
ఆకట్టుకోని పాటలు
స్లో నెరేషన్
ట్యాగ్ లైన్: టక్ ఒక్కటే సరిపోదు!