NTV Telugu Site icon

వర్షాల కారణంగా టీటీడీ కీలక నిర్ణయం..

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు, ఏపీలో ప్రభావం చూపుతోంది. చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తిరుపతిలో సైతం వర్షాలతో ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతోంది. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు సహాయచర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

వర్షాల కారణంగా శ్రీవారి దర్శనానికి తిరుమలకు రాలేకపోతున్న భక్తులకు ఊరట కలిగించే విషయాన్ని తెలిపింది. భారీ వర్షాలతో శ్రీవారి దర్శనానికి రాలేకపోయిన భక్తులక మరో అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. నేడు, రేపు దర్శన టికెట్లు ఉంటే వర్షాలు తగ్గాక భక్తులకు స్వామి వారి దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. వర్షం వల్ల తిరుమల వెళ్లలేని భక్తులకు తిరుపతిలో వసతి కల్పించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాల్లో భక్తులకు బస ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.