NTV Telugu Site icon

టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 12 ఏళ్ల లోపు చిన్నారులకు శాశ్వతంగా ఉచిత ప్రయాణం

తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్త పథకం ప్రవేశపెట్టేందుకు టీఎస్ఆర్టీసీ సమాయత్తం అవుతోంది. తెలంగాణలో 12 ఏళ్ల లోపు చిన్నారులందరూ శాశ్వతంగా ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతారని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరుగుతుందని బాజిరెడ్డి ఆకాంక్షించారు.

Read Also: న్యూఇయ‌ర్ స్పెష‌ల్‌: నిమిషానికి 9 వేల ఆర్డ‌ర్లు

నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ బస్ భవన్‌లో శనివారం నాడు వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు వారు శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి మాట్లాడుతూ కొత్త పథకం గురించి ప్రకటన చేశారు. కాగా న్యూఇయర్ సందర్భంగా శనివారం రోజు 12 ఏళ్ల లోపు చిన్నారులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఇటీవల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.