కామారెడ్డి జిల్లా శాంతాపూర్ లో రైతు భూమ్ బోయి మరణంపై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీచేసింది. పేకాట శిబిరంపై దాడి చేశారు బిచ్కుంద పోలీసులు. అక్కడే పొలంలో వడ్లకు కాపలా ఉన్న రైతు భూమ్ బోయిని చావ బాదారు పోలీసులు. గత నెల 11న భూమ్ బోయి చికిత్స పొందుతూ చనిపోయారు. పోలీసుల కొట్టడం వల్లే చనిపోయాడని ఆరోపిస్తున్నారు భూమ్ బోయి కుటుంబ సభ్యులు.భూమ్ బోయికి సంబంధించిన మెడికల్ రిపోర్టులు, పోస్టుమార్టం నివేదికను సీల్డ్ కవర్లో అందించాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. బిచ్కుంద పోలీసులను స్టేషన్ లోని GD ఎంట్రీ ని అందజేయాలని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ ఈనెల 22కు వాయిదా వేసింది.
అసలేం జరిగిందంటే..
దీపావళి పండుగ రోజు 04-11-2021న సాయంత్రం 5 గంటల సమయంలో కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామంలో రైతు భూం బోయి (47 ఏళ్ళు) పొలంలో ఉన్నాడు. పేకాట శిబిరంపై దాడి పేరుతో అతన్ని బిచుకుంద పోలీసులు కొట్టటం చేత చనిపోయాడు అని కుటుంబ సభ్యులు అంటున్నారు. పోలీసుల దెబ్బలకు భూమ్ బోయి చనిపోయింది వాస్తవమా?అని తెలుసుకొనేందుకు పౌర హక్కుల ప్రజా సంఘం ప్రతినిధులు నిజ నిర్దారణ కమిటీ పరిశీలించింది. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసింది.
దీపావళి పండుగ రోజు శాంతాపూర్ గ్రామంలో హనుమాన్ దేవాలయం దగ్గర పేకాట ఆడుతున్న విషయం బిచుకుంద పోలీసులకు తెలిసింది. 8 మంది పోలీసులు దేవాలయం రెండు వైపుల నుండి వచ్చి అక్కడ వున్న అందరి పైన ఆకస్మిక దాడి చేశారు. ఆ దేవాలయం దగ్గర వడ్లు ఆరబోసుకున్న రైతులు కాపలా కాస్తున్నారు. కాపలా కాస్తున్న రైతులు పోలీసులను చూసి పారిపోలేదు. పేకాట ఆడుతున్న వారు తలా ఒక దిక్కు పారిపోయారు. భూం బోయి రైతు వడ్లకు కాపలాగా వున్నాడు కాబట్టి పారిపోలేదు. కానీ పోలీసులు విచక్షణను కోల్పోయి బలంగా చెంపలపై కొట్టడంతో తల వెనుక భాగం గుడి గోడకు బలంగా గుద్దుకుంది. తర్వాత పిడిగుద్దులు గుద్దారు, తన్నారు. అక్కడే వడ్ల కుప్పలపై ఉన్న కర్రలతో కొట్టారు. పోలీసుల దెబ్బలకు భూం బోయ్ తలకు బలమైన గాయం తగిలింది, స్పృహ తప్పి పడిపోయాడు. పోలీసులు వెళ్ళిపోతూ కల్లు తాగితే లేస్తాడు అని ఉచిత సలహా ఇచ్చి వెళ్ళిపోయారు అని అధ్యయన కమిటీ తెలిపింది.
అనంతరం భూం బోయి కుటుంబ సభ్యులు బాన్సువాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అక్కడి డాక్టర్స్ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేసారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేసారు. కానీ భూం బోయి 10-11-2021 న రాత్రి చనిపోయాడు. భూం బోయి భార్య లచ్చవ్వ పోలీసులు తన భర్తను చంపారు అని పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే భయపెట్టి లచ్చవ్వను అధికారులు కంప్లైంట్ తీసుకోకుండా వెళ్ళగొట్టారు.
దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ధర్మాసనం దృష్టికి పౌరహక్కుల సంఘం తీసుకెళ్ళింది. హైకోర్టులో జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను మొత్తం మెడికల్ రిపోర్టు, పోస్ట్ మార్టం నివేదికను సీల్డ్ కవర్లో పెట్టి కోర్టుకు అందించాలని ఆదేశించారు . క్రైమ్ నంబర్ 179/2021 కు చెందిన GD ఎంట్రీతో సహా కోర్టుకు అందచేయాలని పోలీసులను ఆదేశిస్తూ డిసెంబర్ 22కి వాయిదా వేశారు.