స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తన హవాను కొనసాగించింది… ఇవాళ ఫలితాలు వెలువడిన అన్ని స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు.. కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలు తన ఖాతాలో వేసుకున్న గులాబీ పార్టీ.. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానంలో జరిగిన ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.. ఈ నెల 10వ తేదీన ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ జరగగా.. ఇవాళ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.. ఓట్లు తక్కువగా ఉండడంతో.. కేవలం రెండు గంటలలోపే విజేతలు ఎవరో తేలిపోయింది..
Read Also: బూస్టర్ డోస్..! కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లో ఏది బెటర్..?
ఇక, ఇప్పటికే ఆరు స్థానాలను ఏకగ్రీవం ద్వారా తన ఖాతాలో వేసుకున్న టీఆర్ఎస్ పార్టీ.. పోలింగ్ జరిగిన స్థానాల్లోనూ తమ అభ్యర్థులను గెలిపించుకొని సత్తా చాటింది. కరీంనగర్ జిల్లా నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎల్. రమణ, భానుప్రసాద్ రావు, ఖమ్మం జిల్లాలో తాత మధుసూదన్, ఆదిలాబాద్ జిల్లాలో దండె విఠల్, మెదక్ జిల్లాలో యాదవరెడ్డి, నల్గొండ జిల్లాలో ఎంసీ కోటిరెడ్డి విజయం సాధించారు.. మొత్తంగా ఆరు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. లోకల్‌బాడీ కోటాలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల సంఘం. అయితే ఇందులో ఆరు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం చేసుకున్న అధికార పార్టీ.. మరో ఆరు చోట్ల కూడా తమ అభ్యర్థులకు తిరుగులేని విజయాన్ని అందించింది.