NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

ఏపీలో వర్షాలపై ఆయా శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలపై కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిని సీఎంకు కలెక్టర్లు, అధికారులు వివరించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడినట్లు జిల్లా అధికారులు తెలిపారు. అలాగే, సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, చెరువులు, వాగులు పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన చంద్రబాబు.. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రవాహాలు, నీటి నిర్వహణ చర్యలను సీఎంకు వివరించిన ఇరిగేషన్ అధికారులు.. నేడు కూడా భారీ వర్షాలు ఉంటాయనే హెచ్చరికలతో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచనలు జారీ చేశారు.

వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశం..
తాడేపల్లిలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేడు పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ భేటీకి పార్టీ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ పూర్తి స్థాయి కార్యవర్గాల ఏర్పాటు సహా పలు అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది. అలాగే, బూత్ లెవల్‌లో పార్టీ కేడార్‌ను చైతన్యవంతులను చేసేలా చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. అలాగే, త్వరలోనే నియోజకవర్గాల వారీగా సమీక్షకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ రెడీ అయ్యారు. ఇప్పటికే మంగళగిరి, రేపల్లె నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించిన వైసీపీ.. రానున్న రోజుల్లో మిగతా నియోజకవర్గాల కూడా ఇన్‌ఛార్జ్‌ల నియమించేందుకు ఈరోజు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక, పార్టీ భవిష్యత్ కార్యాచణపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.

కౌలు రైతుల రుణాలపై సమీక్ష.. లోన్స్ మంజూరుపై చర్చ
అమరావతిలోని సచివాలయం 5వ బ్లాక్‍లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఈ ఎస్ఎల్బీసీ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు, నాబార్డు అధికారులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు, డ్వాక్రా సంఘాలకు సహా వివిధ వర్గాలకు బ్యాంకర్లు అందించాల్సిన రుణాలపై సమీక్షించారు. ఇక, ప్రభుత్వం ప్రకటిస్తున్న పాలసీలకు బ్యాంకర్ల సహకారం అవసరమని మంత్రి చెప్పుకొచ్చారు. ముద్ర, PMGP, వ్యవసాయ, పారిశ్రామిక రుణాలపై ప్రధానంగా చర్చించారు. ఇక, కౌలు రైతులకు రుణాల మంజూరులో ప్రత్యేకంగా కృషి చేయాలనే కోణంలో సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాయితీ రుణాల మంజూరుపై చర్చించారు.

బతుక‌మ్మ చీర‌ల‌కు మించి ప్రయోజనాలు క‌ల్పిస్తున్నాం.. హరీష్ రావుకు సీతక్క కౌంటర్
మాజీ మంత్రి హ‌రీష్ రావు వ్యాఖ్య‌ల‌ను పంచాయ‌తీ గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ‌ల శాఖ మంత్రి సీత‌క్క‌ ఖండించారు. ప్ర‌జా ప్ర‌భుత్వంలో బతుకమ్మ చీరను బంద్ పెట్టారన్న హ‌రీష్ రావు వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నామన్నారు. నాసి ర‌కం చీర‌లిచ్చి మ‌హిళ‌ల ఆత్మ‌గౌర‌వాన్నిబీఆర్ఎస్ కించ‌ప‌రిచిందన్నారు. బతుక‌మ్మ చీర‌ల‌కు మించిన ఆర్దిక ప్ర‌యోజ‌నాల‌ను మ‌హిళ‌ల‌కు క‌ల్పిస్తున్నామన్నారు. బ‌తుక‌మ్మ చీర‌ల‌కు గ‌త ప్ర‌భుత్వం ఏడాదికి చేసిన ఖ‌ర్చు రూ.300 కోట్లు మాత్ర‌మే అన్నారు. మ‌హిళ‌ల‌కు ఆర్దిక స్వేచ్చ క‌ల్పించేందుకు ఆర్టీసీలో ఉచిత బ‌స్సు ప్ర‌యాణాన్ని అమ‌లు ప‌రుస్తున్నామని తెలిపారు. మ‌హిళ‌కు ప్ర‌యాణ బారం లేకుండా ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. పైసా ఖ‌ర్చు లేకుండా మ‌హిళ‌లు ఉచిత ప్ర‌యాణం చేస్తున్నారన్నారు. నిన్నటి దాకా 98.50 కోట్ల ఉచిత ప్ర‌యాణాల‌ను అక్క‌చెల్లెమ్మ‌లు వినియోగించుకున్నారని తెలిపారు. ఉచిత ప్ర‌యాణం విలువ అక్ష‌రాల రూ. 3,325 కోట్లు అని స్పష్టం చేశారు.

పైసా పనిలేదు రాష్ట్రానికి లాభం లేదు.. అయినను పోయి రావాలె హస్తినకు..
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రానికి పైసా లేదు, లాభం లేదని.. పది నెలల్లో 25 సార్లు ఢిల్లీకి వెళ్లారని.. 25 సార్లు వెళ్లి 25 సార్లు నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్‌ జూబ్లీ కూడా చేస్తివి అని ఎద్దేవా చేశారు. తట్టా మట్టి తీసింది లేదు.. కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు. అన్నదాతలు బిచ్చమెత్తుకుంటున్నారని, గురుకులాలు గాలిలో దీపాలుగా మారాయని, వైద్య వ్యవస్థ కుంటుపడిందని, విద్యావ్యవస్థ గాడి తప్పిందని అన్నారు. మూసీ, హైడ్రా పేరుతో పేదళ్ల పొట్టలు కొట్టి, 420 హామీలను మడిచి మూలన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగలు పండగళ్లా లేవని, ఆడబిడ్డలకు చీరలు రావడం లేదని, తాతయ్యలు ఆశించిన పింఛను, తులం బంగారం జాడే లేదని,స్కూ టీలు, కుట్టు మిషన్లు లేవని, అయినా సీఎం ఢిల్లీకి వెళ్లాల్సిందేనని ట్వీట్టర్ వేదికగా ఫైర్‌ అయ్యారు.

చెన్నైలో భారీ వర్షాలు..హోటళ్లకు వెళుతున్న ధనవంతులు!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దేశంలోని పలుచోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గత మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు తమిళనాడు రాజధాని చెన్నై నగరం చిగురుటాకులా వణికిపోతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో.. ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు ధనవంతులు, ఐటీ జాబర్స్ కొందరు కుటుంబాలతో కలిసి విలాసవంతమైన హోటళ్లకు వెళుతున్నారు. చెన్నై నగరంలో గతేడాది డిసెంబరులో భారీ వర్షాలు కురవడంతో ఇళ్లలోకి వరద నీరు చేరింది. చాలా చోట్ల బైక్స్, కార్లు కొట్టుకుపోయాయి. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా.. ధనవంతుల్లో చాలామంది విలాసవంతమైన హోటళ్లలో గదులు బుక్‌ చేసుకుని కుటుంబాలతో కలిసి దిగిపోతున్నారు. తాగునీరు, కార్ పార్కింగ్‌, విద్యుత్‌ సరఫరాతో పాటు వైఫై ఉన్న హోటళ్లకు షిఫ్ట్ అవుతున్నారట.

ఉప్పల్ స్టేడియంలో బ్లాక్ టిక్కెట్ల దందా.. ఈడీ దర్యాప్తు ముమ్మరం..
ఉప్పల్ స్టేడియంలో నిధుల గోల్మాల్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మూడు కంపెనీలకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 8న అజారుద్దీన్ను విచారించిన విషయం తెలిసిందే. అజార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బాడీడ్రెంచ్ ఇండియా, సర స్పోర్ట్స్, ఎక్స్లెంట్ ఎంటర్ప్రైజెస్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని కంపెనీలకు ఆదేశించింది. జనరేటర్స్, జిమ్ పరికరాలు, క్రికెట్ బాల్స్, ఇతర వస్తువుల కొనుగోలుకు సంబంధించి ఈడీ విచారణ చేపట్టిన విషయం తెలసిందే. అజారుద్దీన్ 2020 నుంచి 2023 వరకు హెచ్ సీ ఏలో కోట్ల రూపాయల నిధులు గోల్ మాల్ చేశారని ఫారెన్సిక్ నివేదిక వెల్లడించింది. ఆగస్ట్ 10వ తేదీన హెచ్ సీ ఏ నిధులపై సుప్రీం కోర్ట మాజీ న్యాయవాది జస్టిస్ లావు నాగేశ్వర్‌రావు కమిటీ ఆడిట్ నిర్వహించింది. ఇందులో క్రికెట్ బాల్స్ కొనుగోలులో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. దీంతో ఉప్పల్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేయడంతో అజారుద్దీన్ పై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు.

మరోసారి కొండా సురేఖపై సమంత కీలక వ్యాఖ్యలు..
అక్కినేని నాగార్జున కుటుంబంపై అలాగే నాగ చైతన్య మాజీ శ్రీమతి సమంతపై తెలంగాణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిన విషయమే. దింతో టాలీవుడ్ నటీనటుల అందరు ఏకమై కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబడుతూ అక్కినేని నాగార్జునకు మద్దతుగా నిలిచారు. అలానే నటి సమంత కూడా కొండా సురేఖకు నా విడాకులు నా వ్యక్తిగతం నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచాలని కాస్త ఘాటుగా జవాబు ఇచ్చింది సమంత. నాగార్జున కూడా కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసు వేసాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.

పుష్ప – 2 రిలిజ్ డేట్ మారేది లేదు.. ఎవడొచ్చినా తగ్గేదేలేదు..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఎక్కడా కూడా తగ్గేదిలేదు అన్నట్టుగా షూటింగ్ చక చక చేస్తున్నారు యూనిట్. దర్శకుడు సుకుమార్ మొదటి పార్ట్ కంటే మరింత పవర్ ఫుల్ గా సెకండ్ పార్ట్ ను రెడీ చేస్తున్నాడు. రోజురోజుకు పుష్ప గాని క్రేజ్ మరింత పెరిగిపోతుంది. వాస్తవానికి పుష్ప గాడి రూలింగ్ ఆగస్టు 15 నుండి స్టార్ట్ కావాల్సి ఉంది కానీ షూటింగ్ డిలే కారణంగా  వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను డిసెంబరు 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని ఆ మధ్య ప్రకటించారు మేకర్స్. కానీ ఇటీవల ఈ సినిమా డేట్ మరోసారి మారిందని సంక్రాంతి అని క్రిస్మస్ అని ఇలా రకరాలుగా సోషల్ మీడియా లో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. వాటన్నిటికీ చెక్ పెడుతూ మేకర్స్ తాజాగా మరొక పోస్టర్ రిలీజ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబరు 6న రిలీజ్ ఫిక్స్ అని తెలియజేస్తూ పోస్టర్ లో పేర్కొన్నారు. అలాగే రిలీజ్ కు ఒక రోజు ముందుగా అనగా డిసెంబరు 5 న రాత్రి 9:30 గంటలకు రెండు తెలుగు రాష్టాల్లో ప్రీమియర్స్ వేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు మైత్రీ నిర్మాతలు. హనుమాన్ చిత్ర స్ట్రాటజీని ఫాలో అవుతూ సినిమాపై మరింత అంచనాలు పెంచుతున్నారు. మైత్రీ మూవీమేకర్స్ నిర్మించే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి  దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఎనిమిదేళ్ల తర్వాత బరిలోకి.. గుడ్డు పెట్టిన విరాట్ కోహ్లీ!
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత స్టార్‌ ఆటగాడు విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. 9 బంతులు ఎదుర్కొన్న విరాట్.. పరుగుల ఖాతానే తెరవలేదు. విలియమ్ ఓరూర్కీ బౌలింగ్‌లో గ్లెన్‌ ఫిలిప్స్ క్యాచ్‌ పట్టడంతో కింగ్ పెవిలియన్‌కు చేరాడు. కోహ్లీ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘కోహ్లీ పెద్ద గుడ్డు పెట్టాడు’ అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
టెస్టుల్లో విరాట్ కోహ్లీ ఎక్కువగా సెకండ్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తుంటాడు. శుభ్‌మన్ గిల్ గైర్హాజరీతో ఈ టెస్టులో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. డకౌట్ అవ్వడంతో మరోసారి వన్‌డౌన్ అతడికి కలిసిరాలేదు. 2016లో వెస్టిండీస్‌పై వన్‌డౌన్‌లో విరాట్ బ్యాటింగ్‌కు వచ్చి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 3, 4 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటివరకు టెస్టుల్లో కింగ్ కేవలం నాలుగు టెస్టుల్లో మాత్రమే వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేశాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 97 పరుగులే చేశాడు. కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు. విరాట్ అత్యధిక స్కోర్ 41.