NTV Telugu Site icon

నేడు కోనసీమలో ప్రభల ఉత్సవం..

తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో నేడు ప్రభల ఉత్సవం ఎంతో వైభవోపేతంగా నిర్వహించనున్నారు. సంక్రాంతి సమయంలో కోనసీమ వీధుల్లో నడయాడుతున్న ఇంద్రధస్సులా తీర్థాలకు వెళ్లే రంగురంగుల ప్రభలు సీమ అందాలను రెట్టింపు చేస్తాయంటే అతిశయోక్తి కాదు. కోనసీమలో జరిగే ప్రభల తీర్థాలకు వందల ఏళ్ల పురాణ చరిత్ర ఉంది. పెద్ద పండగ నాడు మొదలై… ముక్కనుమ, ఆ తరువాత రోజు వరకు కోనసీమ నలుమూలల సుమారు 90 వరకు ప్రభల తీర్థాలు జరుగుతాయి. కనుమ పండుగ రోజున ప్రభల జాతర కోనసీమ గ్రామాల్లో 400 ఏళ్ల సంప్రదాయం.

ఈ నేపథ్యంలో అంబాజీపేట (మం) జగ్గన్నతోటకు 11 గ్రామాల ప్రభలు చేరుకోనున్నాయి. ఏకాదశ రుద్రుల దర్శనం కోసం జగ్గన్నతోటకు భక్తులు పోటెత్తనున్నారు. కోనసీమ ప్రజలు ప్రభల జాతర సందర్భంగా జగ్గన్నతోట వద్ద పోలీస్ బందోబస్త ఏర్పాటు చేశారు. తీర్థానికి తరళివచ్చే భక్తుల కోసం జగ్గన్నతోట వద్ద రహదారిని అధికారులు తీర్చిదిద్దారు. 40 అడుగుల వరకూ పొడవు, 20 అడుగుల వరకూ వెడల్పుతో ప్రభలు ఏర్పాటు చేశారు. అంబాజీపేట (మం) వాకలగరువు, తొండవరం
గ్రామాల్లో అతి ఎత్తయిన ప్రభలు ఏర్పాటు చేయడం విశేషం. వంద మందికిపైగా యువకులు ఒక్కో ప్రభను జగ్గన్నతోట వద్దకు భుజాలపై మోసుకురానున్నారు.