“నవ్వడం యోగం… నవ్వించడం భోగం… నవ్వకపోవడం రోగం…” అంటూ ఓ నవ్వుల సూత్రాన్ని జనానికి పరిచయం చేశారు జంధ్యాల. ఇంటిపేరుతోనే రచయితలుగా ఎందరో వెలుగులు పంచారు. వారిలో పసందైన పదాలు పరిచయం చేసిన వారు ఎందరో. అలాంటి వారిలో జంధ్యాల పేరు వినగానె తెలుగుజనానికి కితకితలు పెట్టినట్టు ఉంటుంది. ఒకటా రెండా మరి, జంధ్యాల రచనలో జాలువారిన పదాలయితేనేమి, ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన వినోదాల విందులయితేనేమి అన్నీ మనకు హాయిగా నవ్వుకొనే వీలు కల్పిస్తాయి.
జంధ్యాల అన్నది ఆయన ఇంటిపేరు. అసలు పేరు వీరవేంకట దుర్గాశివ సుబ్రహ్మణ్య శాస్త్రి. 1951 జనవరి 14న జంధ్యాల నరసాపురంలో జన్మించారు. పండితుల ఇంట పుట్టడం వల్ల చిన్నతనంలోనే సాహిత్యాభిమానం నెలకొంది. తెలుగులో గొప్పకవుల రచనలన్నీ చదివేశారు. చదువుకొనే రోజుల్లోనే నాటకాలు రాసి ప్రదర్శించేవారు. ఆయన రాసిన ‘ఏక్ దిన్ కా సుల్తాన్’ తెలుగునేలలోనే కాదు, చుట్టుపుక్కల రాష్ట్రాల్లోనూ వేల ప్రదర్శనలు చూసింది. ఓ నాటక ప్రదర్శనలో మహానటుడు గుమ్మడితో పరిచయం కలిగింది. ఆ సమయంలో గుమ్మడి, జంధ్యాలను సినిమాల్లో రచయితగా ప్రయత్నించమని సూచించారు. ఆ సూచన పట్టుకొనే గుమ్మడి తనయుడు హీరోగా నటించిన ‘పుణ్యభూమి కళ్ళు తెరిచింది’లో ఓ పాట రాశారు. తరువాత ‘దేవుడు చేసిన బొమ్మలు’ చిత్రంతో మాటల రచయిత అయ్యారు. తరువాత కె.విశ్వనాథ్ “సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సాగరసంగమం” వంటి చిత్రాలకు మాటలు రాసి మురిపించారు. అలాగే “అడవిరాముడు, డ్రైవర్ రాముడు, వేటగాడు” చిత్రాల్లో జంధ్యాల పలికించిన పదాలు జనాల పెదాలపై చిందులు వేశాయి.
జంధ్యాల చేసి వడ్డించిన భాషాపరోటాలను ఆరగించని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పింగళి వారి బాణీని పట్టేసినట్టే కనిపిస్తుంది కానీ, జంధ్యాల మార్కు మాటల తీరు వేరుగా ఉంటుంది. ఎందుకలా అనిఅడిగేరు – “చరిత్ర అడక్కు… చెప్పింది విను…” అనాల్సి వస్తుంది. ప్రాస కోసం ప్రయాసపడి పరేషాన్ చేసేవాళ్లు ఎందరో ఉంటారు. కానీ, ఏ భాషలోనైనా, ఏ యాసతోనైనా ప్రాసల పాయసాలు చేయగల నేర్పు ఓర్పు జంధ్యాల సొంతం. పదాలతో రిథమ్ సృష్టించగల దిట్ట జంధ్యాల. కావాలంటే “ఈస్ట్, పేస్ట్, టోస్ట్…” అంటూ ‘వేటగాడు’లో జంధ్యాల కలం పలికించిన పదవిన్యాసాలతో కాసేపు సాగండి. మళ్ళీ మళ్ళీ ఆ యాసతో సాగినా ఏ ఆయాసం మీ దరి చేరదు. పై పెచ్చు వీలుంటే మరోమారు ఆ పదవిన్యాసాలతోనే సాగాలనిపిస్తుంది.
‘విజయావారి’లాగా వినోదాలతోనే జనాన్ని మైమరపించాలని ఎందరో రచయితలు భావించేవారు. అలా రచనలు చేసి ఆకట్టుకున్న వారికి కొదవే లేదు. ఆ రీతినే ఎంచుకున్నారు జంధ్యాల. మెగాఫోన్ పట్టి తొలుత ‘ముద్దమందారం’ పూయించారు. తరువాత ఏకబిగిని సినిమాలు తీశారు. ఆ తీతలోనూ, ఆయన రాతలోనూ మనసులను కట్టిపడేసిన సన్నివేశాలూ ఉన్నాయి. గిలిగింతలు పెట్టిన మాటల కోటలూ ఉన్నాయి. వాటిలో ఒకసారి ప్రవేశిస్తే చాలు మళ్లీ రావాలనిపించదు. జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఆ కోటలు బీటలు వారకుండా తెలుగువారికి నేటికీ వినోదాల విందు అందిస్తూనే ఉన్నాయి. ఇంతలా వినోదాలు పంచిన జంధ్యాల నటనలోనూ ఘటికుడే అనిపించుకున్నారు. కె. విశ్వనాథ్ తలపులో మెరసిన ఓ ఊహకు తన అభినయంతో జంధ్యాల ప్రాణం పోసిన తీరును ‘ఆపద్బాంధవుడు’లో చూసి తీరాల్సిందే. బహుముఖ ప్రజ్ఞతో భాసిల్లిన జంద్యాల ప్రతిభాపాటవాలను మననం చేసుకున్న ప్రతీసారి మనసు మహదానందంతో చిందులు వేస్తూనే ఉంటుంది. అందుకే విజ్ఞులు అంటారు – ‘జంధ్యాల అంటే తెలుగువారికి లభించిన ఓ వరం’ అని. కాదంటారా? కాదనేవారు అసలు కనిపిస్తేగా!