Site icon NTV Telugu

తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ విజయవంతం

తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో వైద్యులు అత్యంత క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తి తాపీ పనిచేస్తూ ఓ భవనం నుంచి కిందపడ్డాడు. దీంతో తొడ భాగంలో 3 అడుగుల 10ఎంఎం సైజు గల ఇనుపకడ్డీ చొచ్చుకెళ్లింది. బాధితుడిని తొలుత కైకలూరు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు శస్త్రచికిత్స చేయలేమని చెప్పడంతో అనంతరం విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు కూడా తరలించారు.

అక్కడి వైద్యుల సూచన మేరకు చివరకు బాధితుడు లక్ష్మయ్యను కుటుంబసభ్యులు తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. డాక్టర్లు క్లిష్టతరమైన సర్జరీని పూర్తిచేశారు. దీంతో లక్ష్మయ్య ప్రాణభయం నుంచి బయటపడి నెమ్మదిగా కోలుకుంటున్నాడు. కాగా అరుదైన సర్జరీతో ఇనుపకడ్డీని తొలగించినందుకు లక్ష్మయ్య కుటుంబసభ్యులు తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Exit mobile version