NTV Telugu Site icon

తిరుపతిలో కుప్పకూలిన భవనం.. తప్పిన పెను ప్రమాదం

ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు రాయలచెరువు లీకేజీలతో తిరుపతి జనం కంటిమీద కునుకులేకుండా పోతోంది. తాజాగా ఓ పాత భవనం కుప్పకూలింది. తిరుపతి భవానీ నగర్ లో కుప్పకూలింది మూడంతస్థుల భవనం. వర్షాలకు పది రోజులుగా పాత భవనం నానిపోయింది. శిథిలావస్ధకు చేరడంతో రెండేళ్ళ క్రితమే ఇంటిని ఖాళీచేశాడు యాజమాని. ఇంటిలో, సమీప ప్రాంతాలలో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. ఇదిలా వుంటే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి వర్షాలు.

రాత్రి తిరుపతి, శ్రీకాళహస్తి,సత్యవేడు, నగరిలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాయల చెరువు కట్టకు ఎటువంటి ప్రమాదమూ లేదని, పూర్తిస్థాయిలో చెరువు నిండటం వల్ల కట్టలోని కొన్ని ప్రాంతాల్లో నీరు ఊరి బయటకు వస్తోందని, ఒక ప్రాంతంలో ఇప్పటికే ఇసుక బస్తాలతో మూసేశామని, అలాగే రెండో ప్రాంతంలోనూ చేస్తున్నామని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ తెలిపారు.

చెరువు కు సంబంధించి నీటి ఇన్‌ ఫ్లో, అవుట్‌ ఫ్లో లు నిపుణుల సూచనల మేరకే పంపడం జరుగుతోందని పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించి నిపుణులు, ఇంజనీరింగ్‌ అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్‌ చెబుతున్నారు. రామచంద్రాపురం, తిరుపతి రూరల్‌ మండలాల ప్రజలకు ఏడు రోజులపాటు కంటిమీద కునుకులేకుండా చేసిన రాయలచెరువు కట్టకు పడ్డ మూడు గండ్లను శనివారం సాయంత్రానికి అధికారులు పూడ్చివేశారు. దీంతో ప్రజలు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఒకవైపు రాయల చెరువు తెగిపోతోందన్న వార్తలతో జనం ఆందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రమాదం లేదని, రాయలమ్మకు పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భరోసా ఇచ్చారు.