NTV Telugu Site icon

ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన పాటలను అందించిన ప్రముఖ గేయ రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి నిన్న కన్నుమూసిన విషయం తెలిసింది. గత నెల 24న న్యుమోనియాతో బాధపడుతూ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన ఆయన నిన్న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అయితే సిరివెన్నెల పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఈ రోజు ఉదయం ఫిలించాంబర్‌లో ఉంచారు.

చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్, ఎన్టీఆర్‌, పవన్‌ కళ్యాణ్‌, మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌ లతో పాటు తెలుగు చిత్రసీమ మొత్తం ఆయన భౌతికకాయాన్ని దర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఫిలించాంబర్ నుంచి మహాప్రస్థానం వరకు సిరివెన్నెల అంతిమయాత్ర సాగింది. ఆ తరువాత మహా ప్రస్థానంలో హిందూ సంప్రదాయం ప్రకారం సిరివెన్నెల అంత్యక్రియలు కుటుంబ సభ్యులు నిర్వహించారు.