రైతన్న దేశానికి వెన్నుముక అన్న మాట చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటాం కూడా. అయితే దేశానికి వెన్నుముకలాంటి రైతన్న వెన్నులో వణుకుపుట్టించే విధంగా రాజకీయ పార్టీలు వాటి లబ్దికోసం రాక్షస క్రీడ ఆడుతున్నాయి. రాజకీయ పార్టీలు ఆడే రాజకీయ రాక్షస క్రీడలో రైతన్నను పావుగా మారుతున్నాడు.
మా ప్రభుత్వంలో రైతులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతాం.. నకిలీ విత్తనాలు, ఎరువులును ఆరికడతాం.. పంటకు మద్దతు ధర ఇస్తామంటూ ఇలా వాగ్దానాలు చేసి గద్దెనెక్కుతున్నారు. ఆ తరువాత రైతన్న పంటను కనీస మద్దతు ధర ఇవ్వకుండా గద్దాలా తన్నుకూపోతున్నారు. ఇంకా శోచనీయ విషయమేంటంటే వ్యవసాయంలో రైతన్న సాయంగా ఉండాల్సిన ప్రభుత్వాలు రైతుల పాలిటి నల్ల చట్టాలు తీసుకువస్తూ వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పంట చేతికి వచ్చిందని సంతోషపడాలో లేక.. కనీస మద్దతు ధర లేక కన్నీరు పెట్టాలో తెలియక రైతన్న ఆయోమయంలో పడుతున్నాడు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కర్షకుడి పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు యాసంగిలో వరి వేయకూడదని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూ రైతుల్లో మరింత గందోరగోళాన్ని సృష్టిస్తున్నాయి. సరైన ప్రణాళికలు లేకుండా, స్పష్టత లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను గందరగోళంలో పడేసే ప్రకటనలు చేస్తున్నాయి. ఇప్పటికైనా దేశానికి వెన్నుముకైన రైతన్న వెన్నుతట్టి అండగా మేమున్నామని ప్రభుత్వాలు నిలబడాలని పలువురు కోరుకుంటున్నారు.
