తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనత సాధించింది. బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రాలలో దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం… ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ (ODF) విషయంలో తెలంగాణ 96.74 శాతంతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ తర్వాతి స్థానంలో తమిళనాడు (35.39 శాతం), కేరళ (19.78 శాతం), ఉత్తరాఖండ్ (9.01 శాతం), హర్యానా (5.75 శాతం), కర్ణాటక (5.59 శాతం), ఆంధ్రప్రదేశ్ (4.63 శాతం) ఉన్నాయి. జమ్మూకశ్మీర్, బీహార్, పశ్చిమ బెంగాల్, గోవా తదితర రాష్ట్రాలు మాత్రం ఓడీఎఫ్ విషయంలో అట్టడుగున ఉన్నాయి.
Read Also: సంక్రాంతి సందర్భంగా మరో 10 ప్రత్యేక రైళ్లు
కాగా బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాలలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిచిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల వల్లే పల్లెలు ఆదర్శంగా మారాయని ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు. దేశంలో 5,82,903 ఆవాసాలు ఉండగా కేవలం 26,138 ఆవాసాల్లో మాత్రమే బహిరంగ మల విసర్జన రహిత కార్యక్రమాలు జరుగుతున్నాయని.. 26,138 ఆవాసాల్లో సగానికి మించి 13,737 ఆవాసాలు తెలంగాణలోనే ఉండటం విశేషమని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
