Site icon NTV Telugu

TS: హస్తిన నుంచి గవర్నర్‌ తమిళిసైకి పిలుపు.. ఏం జరుగుతోంది..?

Tamilisai Soundararajan

Tamilisai Soundararajan

తెలంగాణలో గత కొంత కాలంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. అధికారపక్షానికి, గవర్నర్‌కు క్రమంగా దూరం పెరుగుతూ పోతోంది.. కొన్ని సార్లు ప్రత్యక్షంగా.. పరోక్షంగా ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై కామెంట్లు కూడా చేశారు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌.. ఈ మధ్య రాజ్‌భవన్‌ వేదికగా నిర్వహించిన ఉగాది వేడుకల్లోనూ.. ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలను ఉగాది ఉత్సవాలకు ఆహ్వానించినా వారు ఎవరు రాలేదని గవర్నర్ తమిళిసై అసంత్రృప్తి వ్యక్తం చేశారు. ప్రతిసారి ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించినా వారు నా ఆహ్వానాన్ని పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించిన ఆమె.. యాదాద్రి సంప్రోక్షణకు తనకు వెళ్లాలని ఉన్నా ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందలేదన్నారు.. రాజ్ భవన్ పరిమితులేమిటో తనకు తెలుసునని.. శక్తిమంతురాలినైన తన తలను ఎవరూ వంచలేరంటూ హాట్‌ కామెంట్లు చేశారు.. ఇక, తనకు ఎలాంటి ఇగో లేదని అందరితో సక్యంగా ఉండే స్నేహపూర్వక వైఖరి తనదని పేర్కొన్నారు తమిళిసై.. అయితే, ఇప్పుడు హస్తిన నుంచి ఆమెకు పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది..

Read Also: Rahul Gandhi: నా వారసుడు రాహుల్ గాంధీయే..! తన ఆస్తినంతా రాసిచ్చిన మహిళ

కేంద్ర హోంశాఖ నుంచి పిలుపు రావడంతో.. ఇవాళ రాత్రికి ఢిల్లీకి వెళ్తున్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌… రేపు హస్తినలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.. అసలే.. రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు క్రమంగా దూరం పెరుగుతోన్న తరుణంలో తమిళిసై.. ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.. మరోవైపు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఢిల్లీలోనే ఉండటంతో గవర్నర్ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. అయితే, గవర్నర్‌ తన ఢిల్లీ పర్యటనలో ఎవరితో సమావేశం అవుతారు..? ఎలాంటి విషయాలను చర్చిస్తారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. గర్నవర్‌ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్‌ సెషన్‌ ప్రారంభం కావడం నుంచి తాజాగా జరిగిన పరిణామాలు.. గవర్నర్‌కు.. ప్రభుత్వానికి మధ్య గ్యాప్‌ను స్పష్టంగా బయటపెడుతున్నాయి.. గవర్నర్‌గా తమిళిసై వచ్చిన తర్వాత ఆదిలో కొంత మంచి వాతావరణం ఉన్నా.. తర్వాత దూరం పెరగడం మాత్రం చర్చగా మారింది.. ఇక, ప్రజల సమస్యల పరిష్కారం కోసమే రాజ్ భవన్ లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు కూడా తెలిపారు తమిళిసై… గ్రీవెన్స్ సెల్ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించినట్లు చెప్పారు.. ప్రతి నెల రెండో మంగళవారం రాజ్ భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. ఈ తరుణంలో.. ఆమె హస్తిన పర్యటన.. దాని ఫలితాలు ఎలా ఉంటాయి..? అనేది మాత్రం ఉత్కంఠ రేపుతోంది.

Exit mobile version