Site icon NTV Telugu

తెలకపల్లి రవి : మా ఎన్నికలపోటీలో కొత్త కోణాలు

సినిమా పరిశ్రమ దానికదే ఒక ప్రత్యేక ప్రపంచమైనా ప్రచారం ప్రభావం ఆకర్షణ చాలా ఎక్కువగా వుంటాయి. నటుల రాజకీయ ప్రవేశం ప్రభుత్వాల ఏర్పాటు అనుకూల వ్యతిరేక రాజకీయాల కారణంగా ఇది మరింత పెరుగుతుంటుంది. తెలుగు సినిమా నటీనటుల సంఘం మా ఎన్నికలు అందుకే గత రెండు మూడు పర్యాయాలుగా చాలా ఆసక్తి పెంచుతున్నాయి. పోటీలో వున్న అభ్యర్థులు ఎవరన్నది ఒకటైతే వారిని బలపర్చేవారెవరూ ఎవరి బలం ఎంత వంటి ప్రశ్నలు ముందుకు తెస్తున్నాయి.

ఈసారి ప్రకాశ్‌ రాజ్‌ తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. తెలుగు చిత్రపరిశ్రమలో విలన్‌గా క్యారెక్టర్‌ యాక్టర్‌గా అరుదైన రికార్డు ఆయనది.రాజకీయంగా మోడీ ప్రభుత్వ విధానాలను నిశితంగా విమర్శించేందుకు వెనుకాడలేదు. పరిశ్రమలో ఆయన గురించి కొన్ని వివాదాలు వున్న మాట కూడా నిజమే అయినా సేవాకార్యక్రమాలు రాజకీయ చొరవ ప్రత్యేకత ఇచ్చాయి, హైదరాబాదు కేంద్రంగా వున్న తెలుగు చిత్ర పరిశ్రమపై తెలంగాణ రాజకీయాల ప్రభావం ఎక్కువనుకుంటే కెసిఆర్‌ ప్రభుత్వంతోనూ ప్రకాశ్‌ రాజ్‌కు సంబంధాలెక్కువ. ఆయనకు మెగాస్టార్‌ చిరంజీవి శిబిరం అండదండలువున్నాయని కూడా ప్రచారం జరిగింది. సాక్షాత్తూ నాగబాబు మాట్లాడటం కన్నా దీనికి తార్కాణం అక్కర్లేదు. అయితే గతంలో ప్రజారాజ్యం కాంగ్రెస్‌లలో పనిచేసిన చిరంజీవి ఇప్పుడు జగన్‌ ప్రభుత్వంతోనూ సత్సంబంధాలు పాటిస్తుంటారు. తాజాగా ఎపిలో లక్షల వాక్సిన్‌లు ఒకేరోజు వేయడాన్ని అభినందించడం ఇందుకో ఉదాహరణ. మరి పవన్‌ కళ్యాణ్‌ నాగబాబు కూడా జనసేన బిజెపితో పొత్తులో వుండగా దాన్ని వ్యతిరేకించే వ్యక్తి ప్రకాశ్‌ రాజ్‌. కాంగ్రెస్‌ తెలుగుదేశం వారు గతంలో కలసి పనిచేసినట్టే కళాకారుల సమస్యలకు రాజకీయాలకు సంబంధం లేదనే మాట ఇక్కడ ముందుకు రావచ్చు, అంతకన్నా ప్రకాశ్‌రాజ్‌ స్థానికేతరుడనే వాదన కూడా తెచ్చినా అది నిలిచేది కాదు. ప్రకాశ్‌ రాజ్‌ మహబూబ్‌నగర్‌లో వ్యవసాయం చేయడమే గాక నటుడుగా తెలుగువారితో పరిశ్రమతో పెనవేసుకున్నారు.

ప్రకాశ్‌రాజ్‌ప్రకటించిన సమయంలోనే మంచు విష్ణు కూడా పోటీలో వున్నట్టు ప్రకటించడం తండ్రి మోహన్‌బాబుతో కలసి హీరో కృష్ణను కలిసిన ఫోటో విడుదల చేయడం పెద్ద ట్విస్ట్‌.ఇంకొంతమందితో పాటు కృష్ణం రాజు కూడా ఆయనకు మద్దతు నిచ్చారంటున్నారు. గతంలో బహిరంగంగానే విమర్శించుకున్న మోహన్‌బాబు చిరంజీవి ఇప్పుడు స్నేహపూర్వకంగా వుంటున్నారనేందుకు సన్నాఫ్‌ ఇండియా కు చిరు వాయిస్‌ ఇవ్వడమే నిదర్శనం. నరేష్‌ అద్యక్షుడైనాక మా వ్యవహారాలు సరిగ్గా లేవని ఈ ఉభయుల సమక్షంలో వేదికపై రభస జరిగింది కూడా. రాజకీయంగా మోహన్‌బాబు కూడా జగన్‌కు మద్దతుగా బయిలుదేరినా ఈ ప్రభుత్వం బకాయిలు ఇవ్వకపోవడం వంటివాటిపై విమర్శలు చేశారు. మహాభారతంలో అర్జునుడు దుర్యోధనుడు వస్తే కృష్ణుడు చేసినట్టుగా చిరంజీవి పరిస్తితి తయారైందని ఎవరో రాశారు. అయితే ఎన్నికల బరిలోకి దిగాక స్పష్టత దానికదే రావలసిందే. మంచు విష్ణు రంగప్రవేశంతో పోటీ రసవత్తరంగా తయారవడం తథ్యం. ఇంకా జీవితా రాజశేఖర్‌,హేమ కూడా రంగంలో వున్నా బహుశా వీరి మధ్యనే పోటీ కేంద్రీకృతం అవుతుంది. ఈ లోగా మధ్యవర్తులు మల్లగుల్లాలు చాలా వుంటాయి. సినిమా మలుపుల కంటే ఇవేమీ తక్కువగా వుండవు. కాకపోతే అవి ఆరోగ్యకరమైన పోటీగా వుండాలి.పరిశ్రమకూ కళాకారులకూ మేలు జరగాలి.

Exit mobile version