తెలుగుదేశం పార్టీకి 41 ఏళ్లు పూర్తి చేసుకుంది. దేశ విదేశాల్లోని పార్టీ శ్రేణులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. 1982 మార్చి 29న తెలుగు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు దివంగత ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తున్నట్లు హైదరాబాద్ వేదికగా ప్రకటించారు. తెలుగు వారి ఆత్మగౌరవం పేరిట ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన టీడీపీ చరిత్రను తిరగరాసింది. తొమ్మిది నెలల్లోనే దశాబ్దాల కాంగ్రెస్ ను మట్టికరిపించింది. అనతికాలంలోనే అధికారం చేపట్టింది. దేశంలో ప్రాంతీయ పార్టీలకు సత్తా ఎంటో జాతీయ స్థాయిలో చూపించింది. పార్టీ ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలు దాటుతోంది. 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. అయితే ఓ ప్రాంతీయ పార్టీ ఇంత కాలం మనగలగడమే అద్భుతం. ఎన్నో సవాళ్లు, సంక్షోభాలు ఎదుర్కొని ఎప్పటికప్పుడు తట్టుకుంది. రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో మనుగడ కొనసాగిస్తోంది. తెలంగాణలో చెప్పుకోదగిన స్థాయిలో పార్టీ లేకున్నా..ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది.
హైదరాబాద్ నడిబొడ్డున 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ పురుడుపోసుకుంది. పార్టీ ఆవిర్భవించిన 9 నెలలకే 1983 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ హయాంలో 1983, 1985, 1989, 1994లలో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. 3 సార్లు టీడీపీ ఘన విజయం సాధించింది. గెలిచిన 3 సార్లూ 200కిపైగా స్థానాలు దక్కించుకుంది. 1984, 1991 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలనూ దక్కించుకుంది. 1994 శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత.. పార్టీలో అంతర్గత పరిణామాలతో ముఖ్యమంత్రిగా 1995 సెప్టెంబరు 1న చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. పార్టీ అధ్యక్షుడిగా పట్టు సాధించారు. తర్వాత జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. నేటికీ ఆయన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. టీడీపీ హయంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నారు. చంద్రబాబు హయంలో పార్టీ రెండు సార్లు ప్రతిపక్ష పాత్రకే పరిమితం అయింది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నికైయ్యారు. ప్రస్తుతం ఆయన ఏపీ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు.
పార్టీ ఆవిర్భావం అనంతరం 2004, 2019 ఎన్నికల్లో మాత్రమే టీడీపీ దారుణమైన ఫలితాలు, ఓటమిని చవిచూసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు టీడీపీ ఎన్‌డిఎ నుండి వైదొలిగింది. దీంతో అనంతరం జరిగిన 2019 ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. వచ్చే ఎన్నికల కోసం సిద్ధం అవుతూ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను జరుపుతోంది. ఈ సమయంలో 41వ ఆవిర్భావ సభ నాంపల్లి గ్రౌండ్స్ లో జరుపుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమాలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు.
మరోవైపు తెలంగాణలో పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చెప్పుకోవడానికి పెద్దస్థాయి నాయకులు అంటూ ఎవ్వరూ లేరు. ఉన్న నాయకులంతా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడంతో తెలంగాణ టీడీపీని పాలాళంలోకి నెట్టింది. అయితే, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లోనూ టీడీపీకి క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తోంది. ఈ క్రమంలో కాసాని జ్ఞానేశ్వర్ లాంటి నేతలను పార్టీ చేర్చుకుంది. అంతే కాదు బీసీ వర్గానిచెందిన నాయకుడినే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. కొద్ది నెలల క్రితం ఖమ్మంలో భారీ బహిరం సభ నిర్వహించారు. ఈ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో పార్టీకి తెలంగాణలోనూ పూర్వ వైభవం వస్తుందన్న ధీమా పార్టీ శ్రేణుల్లో పెరిగింది. ఈ క్రమంలో నేడు 41వ ఆవిర్భావ సభను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మున్మందు ఎన్ని విజయాలు సొంతం చేసుకుంటుందో? సవాళ్లను ఎదుర్కుంటుందో చూడాలి.
ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించడానికి మళ్లీ పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగు జాతిని నిలబెట్టేందుకు ఆత్మస్థైర్యంతో పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.టీడీపీ తన 40 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చరిత్ర సృష్టించింది. తెలుగు ప్రజలే అని చంద్రబాబు అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సమాజంలోని అన్ని వర్గాల మధ్య సమాన అధికార పంపిణీకి టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి అన్నారు. గ్రామస్థాయి వరకు సంస్కరణల ప్రయోజనాలను అందించిన ఏకైక రాజకీయ పార్టీగా టీడీపీ చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు చెప్పారు.