Site icon NTV Telugu

టీ కాంగ్రెస్‌ నేతల మధ్య ఇంద్రవెల్లి చిచ్చు…!

పంతం నీదా..నాదా అన్నట్టుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంద్రవెల్లి సభ. చూస్తుండగానే పెద్ద సవాల్‌గా మారిందీ సమస్య. సభ నిర్వహిస్తామని ఒకరు.. వద్దని ఇంకొకరు భీష్మించడంతో పార్టీలో చిచ్చు రేపుతోంది. ఎవరికి వారు ఆధిపత్యానికి పోటీ పడుతుండటంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

రేవంత్‌, మహేశ్వర్‌రెడ్డిల మధ్య ఇంద్రవెల్లి సభ చిచ్చు!

దళిత గిరిజన ఆదివాసీల ఆత్మగౌరవ దండోరాకి కాంగ్రెస్ సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లా నాయకుల మధ్య పంచాయితీ.. ఏకంగా పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో రచ్చకు కారణమైంది. పీఏసీ మీటింగ్‌లోనే ఇంద్రవెల్లి సభపై సవాల్ విసురుకున్నారు నాయకులు. ఇంద్రవెల్లి నుండే దండోరా మోగిస్తా.. సభ నిర్వహించి తీరుతానని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అదే ఉమ్మడి జిల్లాకు చెందిన నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఈ ప్రకటనపై గుర్రుగా ఉన్నారు. ముందుగా సమాచారం లేకుండా సభ ఎట్లా నిర్వహిస్తారు? మారుమూల పల్లెకు జనం ఎలా వస్తారు? అని ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. సమస్య చిన్నదైనా… రేవంత్‌, మహేశ్వర్‌రెడ్డిల మధ్య పెద్ద చిచ్చు పెట్టింది.

తనను తక్కువ చేస్తున్నారనే ఫీలింగ్‌లో మహేశ్వర్‌రెడ్డి!

ఇటీవల ప్రకటించిన కొత్త పీసీసీలో రేవంత్‌రెడ్డి సారథిగా వస్తే.. మహేశ్వర్‌రెడ్డిని AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. ఇలా కీలక హోదాల్లో ఉన్న ఇద్దరు నాయకులు పంతాలకు పోవడం పార్టీవర్గాల్లో చర్చగా మారింది. అయితే అదే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు.. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి మధ్య ఉన్న మనస్పర్థల వల్ల పెద్ద నేతల మధ్య వ్యవహారం బెడిసి కొట్టేంత వరకు వెళ్లిందని టాక్‌. పైగా మహేశ్వర్‌రెడ్డి వెనక ఇంతముందు పార్టీ వ్యవహారాలు చూసిన ఓ నాయకుడు ఉన్నట్టు అనుమానిస్తున్నారట. అయితే జిల్లాలో ప్రేమ్‌సాగర్‌రావును ప్రోత్సహిస్తూ తనను తక్కువ చేసి చూస్తున్నారనే ఫీలింగ్‌లో మాజీ ఎమ్మెల్యే ఉన్నారట.

ఇంద్రవెల్లి సభకు మహేశ్వర్‌రెడ్డి డుమ్మా కొడతారా?
ఇంద్రవెల్లి సభ కోసం సొంత టీమ్‌ను దించిన రేవంత్‌?

ఇంద్రవెల్లి సభ విషయంలో తన పంతం నెగ్గించుకునే పనిలో రేవంత్‌రెడ్డి ఉన్నట్టు సమాచారం. అదే సమయంలో ఇతర ప్రాంతాల్లో పర్యటనలకు వెళ్తున్నారు మహేశ్వర్‌రెడ్డి. తనది ముందే ఫిక్స్‌ అయిన టూర్‌గా ఈ నిర్మల్‌ నేత చెబుతున్నా.. ఇంద్రవెల్లి సభ బ్యాక్‌డ్రాప్‌లోనే ఆయన డ్రాప్‌ అయ్యారని అనుకుంటున్నారట. అదే జిల్లాకు చెందిన AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ లేకుండానే ఇంద్రవెల్లి సభ జరిగితే ఇంకో చర్చ జరగడం ఖాయం. ఇంద్రవెల్లి సభ కోసం ఇప్పటికే తన టీమ్‌ను రంగంలోకి దించారు రేవంత్‌రెడ్డి. జనసమీకరణలో పడ్డారు. ఆ కార్యక్రమానికి ఇంఛార్జ్‌గా ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు ప్రకటించారు కూడా. అలాగే తన టీమ్‌లోని ఎమ్మెల్యే సీతక్కను ముందువరసలో ఉంచారు.

రేవంత్‌కు వ్యతిరేకంగా సీనియర్లు యాక్టివ్‌!

తాజా గొడవతో కాంగ్రెస్‌లోని రేవంత్‌ వ్యతిరేక శిబిరంలోని సీనియర్‌ నాయకులు యాక్టివ్‌ అయ్యారట. రేవంత్‌ను కట్టడి చేయడానికి చూస్తున్నట్టు సమాచారం. మరి.. ఇంద్రవెల్లి చిచ్చు రానున్న రోజుల్లో కాంగ్రెస్‌లో ఎలాంటి ప్రకంపనలు రేపుతుందో చూడాలి.

Exit mobile version