Site icon NTV Telugu

తెలంగాణ బీజేపీలో గుడ్‌బైల కాలం నడుస్తోందా…?

పెద్దనేతలు చేరితే పార్టీ బలోపేతం అవుతుందని సంతోషిస్తారు. కానీ.. ఆ శిబిరంలో రివర్స్‌. ఒక మాజీ మంత్రి చేరితే.. ఇద్దరు మాజీ మంత్రులు గుడ్‌బై చెప్పేశారు. పార్టీలోనూ అంతర్గత చిచ్చు రగిలిందట. ముఖ్య నాయకుల మధ్యే దూరం పెరిగిందని టాక్‌. ఆ పార్టీ ఏంటో.. లెట్స్‌ వాచ్‌!

బీజేపీని వీడిన ఇద్దరు మాజీ మంత్రులు!

బీజేపీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చేరిక తర్వాత కాషాయ శిబిరంలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆయన కమలం తీర్థం పుచ్చుకునే సమయంలో జరిగిన పరిణామాలు రచ్చగా మారిన సంగతి తెలిసిందే. ఆ ప్రభావం అలా రాజుకుంటూ రాజుకుంటూ ఇప్పుడు ఇద్దరు మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, ఇ. పెద్దిరెడ్డిలు బీజేపీని వీడి వెళ్లేలా చేసింది.

ఈటల చేరిక సమయంలోనే ఓపెన్‌గా విమర్శలు

ఈటల బీజేపీలో చేరితే పార్టీ బలోపేతం అవుతుందని కమలనాథులు లెక్కలేశారు. కానీ.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వారిని కలవర పెడుతున్నాయట. ఈటల బీజేపీలో చేరుతున్నప్పుడే ఒకరిద్దరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపెన్‌గానే నిరసన తెలిపారు కూడా. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఇలా నిలదీసిన వారిలో ముందువరసలో మాజీ మంత్రులు ఇ. పెద్దిరెడ్డి, మోత్కుపల్లి ఉన్నారు. వీరిద్దరూ టీడీపీని వీడి బీజేపీలోకి వచ్చినవారే.

అవమానంగా భావించిన పెద్దిరెడ్డి!

ఈటలను బీజేపీలో చేర్చుకునే విషయంలో తమ అభిప్రాయాన్ని తీసుకోలేదని ఇద్దరు మాజీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా హుజురాబాద్‌కే చెందిన తనకు తెలియకుండా ఈ చేరికలు ఏంటని ఫైర్‌ అయ్యారు పెద్దిరెడ్డి. ఇది తనను అవమానించడం కాదా అని తనను కలిసిన బీజేపీ పెద్దలను పెద్దిరెడ్డి నిలదీశారట. ఇదే అంశంపై ఎవరెళ్లి బుజ్జగించినా ఆయన చల్లబడలేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈటల వచ్చాక తన అవసరం లేదని బీజేపీ భావించినట్టు ఉంది.. అందుకే రాజీనామా చేసినట్టుగా సన్నిహితులకు చెప్పారట.

అదను చూసి బీజేపీ నేతలకు టీఆర్‌ఎస్‌ గాలం!

బీజేపీని వీడిన మోత్కుపల్లి నర్సింహులు కూడా వెళ్తూ వెళ్తూ ఈటలపైనే గురిపెట్టారు. బీజేపీ వైఖరిని ఎండగట్టారు. వాస్తవానికి బీజేపీలో జరుగుతున్న ఈ పరిణామాలను ముందు నుంచీ గమనిస్తూ వస్తున్న టీఆర్‌ఎస్‌.. అదను చూసి ఇద్దరు మాజీ మంత్రులను క్యాచ్‌ చేసింది. స్వయంగా సీఎం రంగంలోకి దిగి వారితో మాట్లాడినట్టు చెబుతున్నారు. ఆ విధంగా మాజీ మంత్రులు టీఆర్‌ఎస్‌కు దగ్గరైనట్టు టాక్‌.

ఈటల చేరిక టైమ్‌లో హడావిడి వల్ల ముఖ్య నేతల మధ్య మనస్పర్థలు

రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉన్నా.. ఇతర పార్టీల నేతలను చేర్చుకుని తెలంగాణలో బలపడాలని చూస్తోన్న బీజేపీకి ఇద్దరు మాజీ మంత్రుల రాజీనామా మింగుడు పడటం లేదు. ఒక మాజీ మంత్రిని తీసుకుంటే.. ఇద్దరు మాజీలు దూరమయ్యారనే చర్చ జరుగుతోంది. పైగా ఈటల జాయినింగ్‌ టైమ్‌లో కొందరు బీజేపీ నాయకులు చేసిన హడావిడి వల్ల కూడా ముఖ్య నేతల మధ్య మనస్పర్థలు వచ్చాయని చెవులు కొరుక్కుంటున్నారు. వారు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారట. ఈ గొడవలు ఎలా ఉన్నా.. ఈటల పేరు చెప్పి బీజేపీ నుంచి ఇంకెవరెవరు గోడ దూకుతారనే చర్చ కాషాయ శిబిరంలో జోరుగానే సాగుతోంది. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version