Site icon NTV Telugu

తీగల కృష్ణారెడ్డికి కాంగ్రెస్‌ గాలం?

ఆయన ఓడిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఓడినచోట మళ్లీ పోటీచేసే అవకాశం దక్కుతుందో లేదో తెలియదు. పక్కచూపులు చూస్తున్నారని ఆ మధ్య పెద్దఎత్తున ప్రచారం జరిగింది. పార్టీ పెద్దల బుజ్జగింపులతో సైలెంట్‌. కానీ.. పరామర్శ పేరుతో మరో నాయకుడితో తాజాగా జరిగిన భేటీ కొత్త ప్రశ్నలకు ఆస్కారం ఇస్తోంది. తీగలాగుతున్నారా? గాలానికి తీగ తగులుతుందా అన్న చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా భేటీ? లెట్స్‌ వాచ్‌!

మళ్లీ చర్చల్లోకి వచ్చిన తీగల!

తీగల కృష్ణారెడ్డి. మాజీ ఎమ్మెల్యే కంటే హైదరాబాద్‌ మేయర్‌గా పాపులర్. మారిన రాజకీయ పరిస్థితులతో ఆయన పొలిటికల్‌ లైఫ్‌ కన్ఫ్యూజన్‌లో పడింది. తీగల అనుచరులకు సైతం ఏం అర్థం కావడం లేదట. ఈ గందరగోళానికి తెరదిందేందుకు ఆ మధ్య బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. కండువా మార్చుకోవడమే మిగిలిందని అనుకుంటున్న తరుణంలో వెనక్కి తగ్గారు. కానీ.. ఇప్పుడు పీసీసీ చీఫ్‌ రేవంత్‌తో జరిగిన భేటీ మాత్రం మరోసారి తీగలను చర్చల్లోకి తీసుకొచ్చింది.

ఇప్పటికీ మహేశ్వరంలో సబిత వర్సెస్‌ తీగల?

మహేశ్వరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచాక.. టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు తీగల. 2018 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారాయన. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి గులాబీ శిబిరంలో చేరి.. ఏకంగా కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం తీగల.. సబితా ఇద్దరూ ఒకే పార్టీలోనే ఉన్నా సఖ్యత లేదు. వైరిపక్షాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వ్యవహరించేవారో.. ఇప్పటికీ అదే వైఖరి కొనసాగుతోంది. మహేశ్వరం టీఆర్‌ఎస్‌ కేడర్‌ కూడా రెండు వర్గాలుగా విడిపోయింది. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో గతంలోలా ఆయన చురుకుగా పాల్గొనడం లేదట. సీఎం కేసీఆర్‌ లేదా మంత్రి కేటీఆర్‌ హాజరయ్యే కార్యక్రమాలకు తప్ప.. ఇతర ప్రొగ్రామ్స్‌కు రావడం లేదు తీగల.

సబిత టీఆర్‌ఎస్‌లో చేరాక.. తీగలకు ప్రాధాన్యం తగ్గిందా?

సబిత టీఆర్‌ఎస్‌లో చేరాక.. మహేశ్వరంలో తన ప్రాధాన్యం తగ్గిందనే ఆవేదనలో ఉన్నారట తీగల. ఆ సమయంలోనే ఆయన బీజేపీలో చేరేందుకు గట్టి ప్రయత్నాలు చేశారట. ఇంతలోనే ప్రగతి భవన్‌ నుంచి ఫోన్‌ రావడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. కోడలు అనితారెడ్డికి రంగారెడ్డి జిల్లా జెడ్పీ ఛైర్మన్‌ పదవిని ఇప్పించుకున్నారు తీగల. కానీ.. తన రాజకీయ భవిష్యత్‌పై మాత్రం క్లారిటీ లేక ఇబ్బంది పడుతున్నారట.

తీగలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్‌?

ఇటీవలే తీగల కృష్ణారెడ్డి అల్లుడు చనిపోయారు. ఆ సందర్భంగా చాలామంది తీగలను పరామర్శిస్తున్నారు. అలా వచ్చి మాట్లాడి వెళ్లారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. ఈ ఇద్దరు నేతలకు టీడీపీలో ఉన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. పరామర్శకు అది కూడా ఒక కారణమని చెబుతున్నా.. తీగలకు కాంగ్రెస్‌ గాలం వేసిందనే టాక్‌ నడుస్తోంది. తీగలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారట రేవంత్‌. దీంతో తీగల కృష్ణారెడ్డి దారెటు అన్న చర్చ మళ్లీ మొదలైంది. సబిత టీఆర్‌ఎలో చేరాక.. అధికారపార్టీలో ఆయనకు ఉక్కపోతగా ఉందని అనుకుంటున్నారట. వచ్చే ఎన్నికల్లో మహేశ్వరంలో టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చే అవకాశాలు అనుమానమే. అందుకే తీగల సేఫ్‌ ప్లేస్‌ చూసుకోవచ్చని ఆయన అనుచరులు సందేహిస్తున్నారట. అందుకే తాజా భేటీ కేవలం పరామర్శకే పరిమితం అవుతుందా.. లేక తీగల భవిష్యత్‌ రాజకీయానికి బాట వేస్తుందో చూడాలి.

Exit mobile version