ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే. స్కూళ్లు తెరవాలన్న నిర్ణయం బాగానే ఉన్నా.. ఆ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలే సర్పంచ్‌లకు టెన్షన్ పెడుతున్నాయట. చేతిలో చిల్లిగవ్వ లేదు.. ప్రభుత్వం నుంచి పైసా రాదు. స్కూళ్లు సాఫ్ చేయకపోతే.. జేబులు సఫా. దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదట సర్పంచ్‌లకు. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ప్రభుత్వ ఆదేశాలతో సర్పంచ్‌లు ఉలికిపాటు!
తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు తెరుచుకుంటున్నాయి. విద్యార్థులకు తరగతి గదుల్లో ప్రత్యక్షంగా పాఠాలు మొదలు పెట్టాలని ప్రభుత్వ ఆదేశాల్లో ఉంది. కరోనా కారణంగా నెలల తరబడి స్కూళ్లు తెరవలేదు. బడిగంట కొట్టి ఏడాదిన్నరపైగానే అయింది. క్లాస్ రూములన్నీ బూజుపట్టాయి. టాయిలెట్లు కంపుకొడుతున్నాయి. స్కూల్ ఆవరణలు చెత్త చెత్తగా మారాయి. వీటిని ఎప్పటిలా శుభ్రంగా ఉంచాలంటే ఖర్చుతోపాటు శ్రమతో కూడుకున్న పని. డబ్బులు కావాలి. సిబ్బంది ఉండాలి. కొన్నిచోట్ల టీచర్లే చీపుర్లు పడుతున్నారు. ఇలాంటి దృశ్యాలు మీడియాలో ప్రముఖంగా వస్తుండటంతో.. ప్రభుత్వం కొత్తగా ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలే గ్రామీణ ప్రాంతాల్లోని సర్పంచ్‌లను ఉలిక్కి పడేలా చేశాయి.
స్కూళ్ల క్లీనింగ్‌కు నిధులు లేక సర్పంచ్‌లు విలవిల!
స్కూలు ఆవరణలు.. తరగతి గదులు బాగు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. గ్రామ పంచాయతీ నిధులు.. అందుబాటులో ఉన్న సిబ్బందితోనే స్కూళ్ల క్లీనింగ్ చేపట్టాలని సర్కార్ ఆదేశాల్లో ఉంది. అసలే పల్లె ప్రగతి పనులతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న సర్పంచ్‌లకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఏ పంచాయతీ పరిధిలోని స్కూళ్లను ఆ పంచాయితీ పాలకులే బాగు చేయాలని చెప్పడంతో.. నిధులు ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నిస్తున్నారు సర్పంచ్‌లు. పట్టణాల్లో మున్సిపాలిటీలకు కొంత వెసులుబాటు ఉన్నా.. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.
తరగతి గదులను కరోనా రహితంగా మార్చాలి!
సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు తెరుచుకోనుండటంతో.. అన్ని విద్యాసంస్థలను ఈ నెల 30లోగా శుభ్రం చేయాలని ప్రభుత్వం ఆదేశాల్లో ఉంది. కరోనా టైమ్‌లో బూజు దులిపితే చాలదు. స్కూలు ఆవరణలో చెత్తా చెదారం ఎత్తితే సరిపోదు. టాయిలెట్లలో రెండు బకెట్ల నీళ్లు కొట్టి ఊరుకుంటామంటే వీలుకాదు. పూర్తి హైజనిక్‌గా ఉండాలి. బ్లీచింగ్.. శానిటైజేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. స్కూళ్లలోని వాటర్ ట్యాంకులు పరిశుభ్రంగా ఉంచాలి. తరగతి గదులు కూడా కరోనా రహితంగా తీర్చిదిద్దాలి.
పట్టించుకోని సర్పంచ్‌లపై వేటు వేస్తామని వార్నింగ్!
ఒకవేళ టీచర్లు చొరవ తీసుకుని చీపుర్లు పట్టినా.. వారే చొరవ తీసుకున్నట్టు మీడియాలో కథనాలు వస్తే.. సర్పంచ్‌లపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. హెడ్మాస్టార్లపైనా చర్యలు ఉంటాయన్నది పాలకుల చెప్పేమాట. దీంతో నిధుల లేమితో ఇబ్బంది పడుతున్న సర్పంచ్‌లు చొరవ తీసుకోకపోతే వారిపై వేటు వేయాలన్న హెచ్చరికలు వారిని మరింత టెన్షన్ పెట్టిస్తున్నాయి. మరి.. ఈ సమస్యను సర్పంచ్‌లు ఎలా అధిగమిస్తారో చూడాలి.
