పంపకాల్లో తేడా వస్తే కోపాలొస్తాయి. ఒకరిపై ఒకరు ప్రతీకారం తీర్చుకోవడానికి రకరకాల పన్నాగాలు పన్నుతారు. ప్రస్తుతం ఆ జిల్లాలో ఇదే జరుగుతోందట. ప్రజాప్రతినిధులు, అధికారులు వైరివర్గాలుగా మారి ప్రతికార చర్యలకు దిగుతున్నారట. ఇప్పుడిదే రాజకీయాలను వేడెక్కిస్తోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ఎప్పుడు ఎవరు ఎలా రివెంజ్ తీర్చుకుంటారో?
సంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్‌లో రాజకీయాలు ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చాయి. జడ్పీ కేంద్రంగా సాగుతున్న గొడవలు ముదురుపాకాన పడి ఎప్పుడేం జరుగుతుందో తెలియడం లేదు. జడ్పీ మీటింగ్‌లో అధికారులపై ప్రజాప్రతినిధులు ఫైర్ కావడంతో మొదలైన విభేదాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎలా రివెంజ్ తీర్చుకుంటారో అంతుచిక్కడం లేదట. పైగా ఒక వర్గానికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి.. మరో వర్గానికి శాసనమండలి ప్రొటైం ఛైర్మన్ భూపాల్‌రెడ్డి కాపు కాయడంతో ఆధిపత్యపోరు మరింత ఆసక్తిగా మారిందట. దానిపైనే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
ఎవరి బండారం బయటపడుతుందో తెలియడం లేదా?
అధికారుల తీరువల్ల గ్రామాల్లో సర్పంచ్‌లపై వేటు పడుతోందని జడ్పీ మీటింగ్‌లో జడ్పీటీసీలు, ఎంపీపీలు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఆ వివాదంలో అధికారులను జడ్పీ ఛైర్‌పర్సన్ మంజుశ్రీ వెనకేసుకొచ్చారు. ఎవరు.. ఎంత తిన్నారో లెక్కలతో సహా అధికారుల పేర్లను బయటపెట్టడంతో వారు కంగుతిన్నారట. ఆ ఎపిసోడ్ తర్వాత ప్రజాప్రతినిధులపై ఆఫీసర్లు గుర్రుగా ఉన్నారట. ఇంతలో గ్రామ పంచాయతీ సభ్యులు కమీషన్ సొమ్ములు పంచుకుంటున్న వీడియో బయటకొచ్చింది. అధికారులే ఈ వీడియోను రిలీజ్ చేశారని ప్రజాప్రతినిధులు అనుమానిస్తున్నారట. పైగా ఇది ట్రైలరేనని.. ఇంకా చాలా వీడియోలున్నాయని.. అన్నీ బయటపెడతామని హెచ్చరిస్తున్నారట అధికారులు. దీంతో ఎవరి బండారం బయటపడుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారట ప్రజాప్రతినిధులు.
పటాన్‌చెరు ఆధిపత్యపోరుకు జడ్పీ వైరివర్గాలు తోడయ్యాయా?
పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ఈ రగడలో ఎక్కువగా ఉండటంతో.. అక్కడి రాజకీయం రంజుగా మారుతోంది. సర్పంచ్‌లపై సస్పెన్షన్లను ఎత్తివేయిస్తూ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆ వర్గానికి చేరువ అవుతున్నారు. జడ్పీటీసీలు, జడ్పీ వైస్ ఛైర్మన్ ప్రభాకర్‌లు ఎమ్మెల్యే శిబిరంలో ఉన్నట్టు చెబుతున్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్ మంజుశ్రీ, అధికారులు శాసనమండలి ప్రొటైం ఛైర్మన్ భూపాల్‌రెడ్డిని ఆశ్రయించినట్టు టాక్. వాస్తవానికి పటాన్‌చెరులో మహిపాల్‌రెడ్డి, భూపాలరెడ్డిల మధ్య ఆధిప్యత పోరు ఉంది. దానికి జడ్పీ వైరివర్గాలు కూడా తోడు కావడంతో సమస్య రాచపుండుగా మారుతోంది.
అవినీతిని పెద్ద ఘనకార్యంగా చూస్తున్నారా?
ఈ మొత్తం పొలిటికల్ ఎపిసోడ్‌లో సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు ఎవరికి వారు భావిస్తున్నారు. అధికారులపై ప్రజాప్రతిధులు.. ప్రజాప్రతినిధులపై అధికారులు ఆరోపణలు చేసుకుంటున్నారు. అవినీతి సొమ్ముల చుట్టూనే పంచాయితీ జరుగుతోంది. చేస్తోంది తప్పయినా.. ఎవరూ తప్పుగా అంగీకరించే పరిస్థితి లేదు. అదో పెద్ద ఘనకార్యంగా ప్రచారం చేసుకోవడం వారికే చెల్లింది. మరి.. పొలిటికల్ వీడియో గేమ్‌లో ఎవరు చిక్కుకుంటారో.. ఎవరు బయటపడతారో చూడాలి.
