Site icon NTV Telugu

ఎమ్మెల్యే వాసుపల్లిపై వైసీపీ కార్పొరేటర్ల గుర్రు

ఆయనో సీనియర్ ఎమ్మెల్యే. టీడీపీ నుంచి గెలిచి అధికారపార్టీ పంచన చేరారు. నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం తహతహలాడుతున్నారు. మొదట్లో అంతా బాగానే ఉన్నట్టు కనిపించినా ఇప్పుడు అసమ్మతి ఆరునొక్క రాగం అందుకుందట. దీంతో అంతర్యుద్ధంలో చిక్కుకున్న ఎమ్మెల్యే ఎలా బయటపడతారోననే చర్చ మొదలైంది.

వాసుపల్లి పార్టీ మారినా వైసీపీలో పెద్దగా మార్పు లేదట!

వాసుపల్లి గణేష్ కుమార్. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. టీడీపీ పవర్‌లో ఉన్నప్పుడు వైసీపీపై చింతనిప్పులు తొక్కేవారు. 2019 సీన్‌ రివర్స్‌. అప్పటి వరకు అనుభవించిన పవర్‌ ప్రభావవో ఏమో.. టీడీపీని కాదని వైసీపీకి జై కొట్టేశారు. అర్ధరాత్రి నిర్ణయంతో అనూహ్యంగా పార్టీ ఫిరాయించారు గణేష్ కుమార్. ఎమ్మెల్యే రాకతో విశాఖ సిటీ పరిధిలో బలం పెరుగుతుందని అంచనా వేసింది వైసీపీ. కానీ, వాసుపల్లి చేరడానికి ముందు తర్వాత పెద్దగా మార్పులు ఏమీ లేవన్నది వైసీపీ వర్గాల వాదన.

టీడీపీ నుంచి వచ్చినవారికి, వైసీపీ కేడర్‌కు పొసగడం లేదట
కార్పొరేటర్లకు, ఎమ్మెల్యేకు మధ్య నిత్యం వార్‌!

విశాఖ సౌత్‌లో మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు.. మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహ్మాన్‌కు వర్గాలు ఉన్నాయి. వీరంతా చాలాకాలంగా వైసీపీతో అనుబంధం కలిగి ఉన్నవాళ్లే. ఎమ్మెల్యే వాసుపల్లితోపాటు కొంత టీడీపీ కేడర్ అధికారపార్టీలోకి వచ్చింది. ఎంత ప్రయత్నించినా పాతనీరు-కొత్తనీరు మధ్య పొంతన కుదరలేదు. జీవీఎంసీ ఎన్నికల్లో ఎమ్మెల్యే వ్యూహాలు ఫలించలేదు. టీడీపీ, వైసీపీ రెబల్స్ ఎక్కువ స్ధానాలు దక్కించుకున్నారు. ఎన్నికల తర్వాత దక్షిణ నియోజకవర్గంలో అంతర్యుద్ధం బాగా పెరిగింది. ఇండిపెండెంట్లుగా గెలిచిన ముగ్గురు కార్పొరేటర్లు సిద్ధిఖ్, భాస్కరరావు, నాగరాజులు వైసీపీ కండువాలు కప్పుకొన్నారు. వీరంతా ముందు నుంచి వైసీపీలోనే ఉన్నారు. పార్టీ టిక్కెట్లు నిరాకరించడానికి ఎమ్మెల్యే కారణమనేది బలమైన వాదన. అందుకే ఎమ్మెల్యే వెర్సస్ కార్పొరేటర్లు అన్నట్టుగా కొన్నిరోజులుగా అంతర్యుద్ధం జరుగుతోంది. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.

జీవీఎంసీ కమిషనర్‌పై ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు
ఎమ్మెల్యేపై సీఎంకు ఫిర్యాదు చేసిన జీవీఎంసీ కమిషనర్‌

తాజాగా ఎంవీడీఎం స్కూల్ దగ్గర అక్రమ నిర్మాణాలను జీవీఎంసీ తొలగించింది. మత్తుపదార్ధాల విక్రయాలు సహా పిల్లలకు ఇబ్బంది కలిగించే వాతావరణం ఉండటంతో షాపులను తీసేశారు. ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యే వ్యక్తిగతంగా తీసుకున్నారట. కమిషనర్‌ సృజనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతోపాటు.. ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వొద్దని సీఎంకు ఫిర్యాదు చేస్తానని వాసుపల్లి హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన కమిషనర్‌.. ఎమ్మెల్యే వ్యవహార శైలిపై సీఎం కార్యాలయానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారట. ఇంతలో వాసుపల్లిని వ్యతిరేకిస్తున్న కార్పొరేటర్లు కూడా కోరస్‌ అందుకోవడంతో రగడ ఆసక్తిగా మారింది.

ఎమ్మెల్యే సంధించిన అస్త్రం మిస్‌ఫైర్‌!

రెండు గ్రూపుల మధ్య నెలకొన్న విభేదాలు ఎంవీడీఎం స్కూల్ దగ్గర షాపుల తొలగింపుతో తారస్థాయికి చేరుకున్నాయి. ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ వాసుపల్లిని కడిగిపారేసింది కార్పొరేటర్ల త్రయం. కమిషనర్‌ లక్ష్యంగా ఎమ్మెల్యే సంధించిన అస్త్రం మిస్‌ఫైర్‌ అయిందనే చర్చ మొదలైంది. అయితే వర్గాలుగా విడిపోయి.. కొట్లాటకు దిగి.. పరువును బజారుకీడుస్తున్నారనే అభిప్రాయం పార్టీ పెద్దల్లో కలుగుతోందట. మరి.. ఎమ్మెల్యే, కార్పొరేటర్ల మధ్య సయోధ్యకు పార్టీ పెద్దలు ప్రయత్నిస్తారో లేదో చూడాలి.

Exit mobile version