Site icon NTV Telugu

వైసీపీ ఎత్తుగడలతో వేడెక్కుతున్న కాకినాడ…!

ఆపరేషన్‌ కాకినాడలో వైసీపీ వేగంగా పావులు కదుపుతోందా? రాజకీయ ఎత్తుగడలు.. వ్యూహాలు ఆసక్తిగా మారుతున్నాయా? త్వరలోనే టీడీపీకి మరో షాక్‌ ఇవ్వనుందా? కాకినాడలో కాకమీద ఉన్న రాజకీయాలు ఏం చెబుతున్నాయి? లెట్స్‌ వాచ్‌!

కాకినాడ మేయర్‌ పీఠంపై వైసీపీ గురి!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అధికారపార్టీ వైసీపీ పూర్తిగా పట్టు సాధించింది. ఇటీవల జరిగిన రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో టీడీపీకి ఝలక్‌ ఇచ్చారు ఆ పార్టీ కార్పొరేటర్లు. 16 మంది టీడీపీ రెబల్‌ కార్పొరేటర్లు వైసీపీకి అనుకూలంగా ఓటేశారు. వాస్తవానికి ఈ కార్పొరేషన్‌లో వైసీపీకి ఉన్నది పదిమంది సభ్యులే. టీడీపీ రెబల్స్‌ చేరికతో ఆ బలం 35 వరకు ఉంటుందన్నది ఒక లెక్క. దీంతో త్వరలో మేయర్‌ పీఠాన్ని కూడా చేజిక్కించుకోవాలని వైసీపీ పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఆ ఎత్తుగడలే కాకినాడ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది.

నాటి ఎన్నికల్లో జగన్‌, చంద్రబాబు ఇద్దరూ ప్రచారం!
వైసీపీ అధికారంలోకి వచ్చాకా కాకినాడలో మారిన రాజకీయం!

2017లో కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది. ఆ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలు రెండూ హోరాహోరీగా ప్రచారం చేశాయి. జగన్‌.. చంద్రబాబులిద్దరూ ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ 32 డివిజన్లు గెలుచుకుని మేయర్‌ పీఠాన్ని సొంతం చేసుకుంది. టీడీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నన్ని రోజులూ ఇక్కడ వారిదే హవా. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీ రాష్ట్రంలో పవర్‌లోకి రావడంతో ఆ ప్రభావం కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌పైనా పడింది. ఇక్కడ పొలిటికల్‌ సీన్‌ రివర్స్‌ కావడానికి ఎంతో టైమ్‌ పట్టలేదు. టీడీపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా వైసీపీ జైకొట్టడం మొదలుపెట్టారు. కార్పొరేషన్‌లో వైసీపీ బలం పెరిగిందనడానికి ఇటీవల జరిగిన రెండో డిప్యూటీ మేయర్‌ పదవి ఎన్నిక అద్దం పట్టింది. మేయర్‌ సుంకర పావని నామమాత్రంగా మిగిలిపోయారు.

రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో తిరగబడ్డ టీడీపీ జాతకం!
వచ్చే నెల 16తో మేయర్‌ పదవి చేపట్టి నాలుగేళ్లు!

టీడీపీ రెబల్‌ కార్పొరేటర్‌ సత్యప్రసాదే రెండో డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆయనకు 25 మంది మద్దతుగా నిలవగా.. టీడీపీకి పదిమందే సపోర్ట్‌ చేశారు. ఆ విధంగా కాకినాడలో టీడీపీ జాతకం తిరగబడింది. ఈ ఎన్నిక ద్వారా టీడీపీని డీలాపడేలా చేసిన వైసీపీ త్వరలో మేయర్‌ కుర్చీకే ఎసరపెట్టబోతున్నట్టు చర్చ జరుగుతోంది. వచ్చే నెల 16తో సుంకర్‌ పావని మేయర్‌ పదవి చేపట్టి నాలుగేళ్లు అవుతుంది. ఆ సమయం కోసమే ఎదురు చూస్తోన్న వైసీపీ.. అసమ్మతి అస్త్రాన్ని ప్రయోగించే ఛాన్స్‌ ఉంది. తమకు 35 మంది కార్పొరేటర్ల మద్దతు ఉందని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించడంతో.. తర్వాత గురి మేయర్‌ పీఠమే అన్నది అందరూ చెప్పేమాట.

టీడీపీ రెబల్‌ కార్పొరేటర్‌కే మేయర్‌ పీఠం?

రెండో డిప్యూటీ మేయర్‌ను ఏ విధంగా టీడీపీ రెబల్‌ అభ్యర్థికి కట్టబెట్టారో.. మేయర్‌ పీఠాన్ని కూడా వైసీపీకి జై కొట్టిన టీడీపీ రెబల్‌ మహిళా కార్పొరేటర్‌కు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కాపు సామాజికవర్గానికి చెందిన మహిళా కార్పొరేటర్‌నే మేయర్‌ చేస్తారని అనుకుంటున్నారు. అదే జరిగితే కార్పొరేషన్‌లో వైసీపీ అనుకూల మేయర్‌ కొలువుదీరడం ఖాయం. రానున్న ఈ నెలరోజులూ కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో రాజకీయాలు హీటెక్కడం కూడా ఖాయమే. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version