Site icon NTV Telugu

అనేక ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఒక్క ఓటమితో కుదేలు!

అనేక ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఒక్క ఓటమితో సోదిలో లేకుండా పోయారు. అన్నీ వరస ఎదురుదెబ్బలే. పార్టీని కాదని వేస్తున్న పొలిటికల్ స్టెప్పులు తడబడుతున్నాయి. ఇప్పుడు సీటుకే ఎసరొచ్చే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఆ మాజీ మంత్రి దారెటు అన్న చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ?

ఐదుసార్లు గెలిచిన చోట సీటుకు ఎసరొచ్చిందా?

జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్‌లో.. టీఆర్‌ఎస్‌లో ఓ వెలుగు వెలిగిన నాయకుడు.. ప్రస్తుతం చర్చల్లో కూడా లేరు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కనుసైగతో రాజకీయాలను శాసించిన నాయకుడిని సొంతపార్టీలోని ప్రత్యర్థులే ఆడేసుకుంటున్నారట. కొల్లాపూర్‌ నుంచి వరసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చోటే సీటుకు ఎసరొచ్చిన పరిస్థితి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జూపల్లి స్పీడ్‌కు బ్రేక్‌లు పడ్డాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి హర్షవర్దన్‌రెడ్డి గెలిచారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌కు చిక్కి గులాబీ కండువా కప్పేసుకున్నారు హర్షవర్దన్‌రెడ్డి. అక్కడ నుంచి జూపల్లికి కష్టాలు రెట్టింపయ్యాయని చెబుతారు గులాబీ నేతలు.

ఉనికి కాపాడుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారా?

ఒకప్పుడు కొల్లాపూర్‌లో ఎదురే లేని జుపల్లికి ఇప్పుడు అడుగడుగునా ఆటంకాలే ఆటంకాలు. ఉనికి కాపాడుకోవడానికే ఆయనకు టైమ్ సరిపోవడం లేదట. ఏ మాత్రం అవకాశం చిక్కినా ప్రత్యర్థులు వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తుండటంతో జూపల్లి వర్గం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ప్రస్తుతం కొల్లాపూర్‌లో టీఆర్‌ఎస్‌ రెండు వర్గాలుగా చీలిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ వర్గపోరు ప్రభావం స్పష్టంగా కనిపించింది. తన వర్గానికి చెందిన వారికి టీఆర్ఎస్‌ టికెట్‌ నిరాకరిస్తే.. మున్సిపల్‌ ఎన్నికల్లో ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి పోటీ చేయించి గెలిపించుకున్నారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నా.. ఆయనకు ఎక్కడో తేడా కొడుతోందని చెబుతున్నారు.

ఎదురు చూసినా నామినేటెడ్‌ పోస్ట్‌ దక్కలేదు!

ఈ మూడేళ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ సర్కార్ అనేక నామినేటెడ్‌ పోస్ట్‌లు ప్రకటించినా.. వాటిల్లో ఎక్కడా జూపల్లి కృష్ణారావు పేరు లేదు. రోజులు గడిచిపోతున్నాయి కానీ.. ఊరట నిచ్చే కబురు ఒక్కటీ లేదని వాపోతోంది ఆయన వర్గం. తిరిగి అసెంబ్లీకిలోకి అడుగుపెడితే కానీ.. జూపల్లికి.. ఆయన నమ్ముకున్నోళ్లకు రాజకీయ భవిష్యత్‌ ఉండదని అనుకుంటున్నారట. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో.. ఇప్పటి నుంచే ఆ మేరకు వర్కవుట్‌ చేస్తున్నారట మాజీ మంత్రి.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేకే టికెట్‌ ఇస్తే .. జూపల్లి ఏం చేస్తారు?

జూపల్లితో ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీ వర్గాలు టచ్‌లోకి వెళ్లాయట. దీంతో ఆయన పార్టీ మారతాయా అన్న చర్చ జరుగుతోంది. కానీ.. జూపల్లి వాటిని ఖండిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లోనే ఉంటామని.. వచ్చే ఎన్నికల్లో జూపల్లికి టికెట్‌ వస్తుందని ఆయన అనుచరులు దీమాగా చెబుతున్నారట. ఒకవేళ సిట్టింగ్‌ ఎమ్మెల్యేకే టికెట్‌ ఇస్తామని చెబితే.. మాజీ మంత్రి ఏం చేస్తారు? పార్టీ మారతారా లేదా? మున్సిపల్‌ ఎన్నికల్లో అనుచరులకు ఉపయోగపడ్డ సింహం గుర్తును అడ్డంపెట్టుకుని బరిలో దిగుతారా? అన్న చర్చ క్రమంగా జనాల్లోకి వెళ్లేలా చేస్తున్నారట. మరి.. జూపల్లి రాజకీయ భవిష్యత్‌ ఏంటో.. ఏం చేస్తారో కాలమే చెప్పాలి.

Exit mobile version