Site icon NTV Telugu

ఎమ్మెల్సీ పదవిపై ఆశ పెట్టుకున్న గుత్తా…!

ఆ కోటాలో ఎమ్మెల్సీ అవుతామని అధికారపార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ.. కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకుడు తన్నుకుపోయారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యే కోటాలో అయినా ఛాన్స్‌ ఉంటుందా? సొంత జిల్లా నుంచి ఆయనకు ఎదురవుతున్న సవాళ్లేంటి? ఎవరాయన? లెట్స్‌ వాచ్‌!

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యేది ఎవరో?

తెలంగాణ శాసనమండలిలో గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేసింది అధికార పార్టీ. ఇటీవల కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన హుజురాబాద్‌ నేత పాడి కౌశిక్‌రెడ్డిని ఎంపిక చేసింది. టీఆర్‌ఎస్‌లో చేరిన రోజుల వ్యవధిలోనే కౌశిక్‌రెడ్డికి గులాబీ శిబిరం ప్రాధాన్యం ఇవ్వడంతో పార్టీలో చర్చగా మారింది. వాస్తవానికి గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీపై కొన్నాళ్లుగా టీఆర్‌ఎస్‌లో చాలా చర్చ జరుగుతోంది. ఎంతోమంది ఆశావహులు.. సీనియర్లు ఆశగా ప్రగతిభవన్‌ వైపు చూస్తున్నారు. వారెవరినీ కాదని కొత్తగా వచ్చిన వారు బూరెల బుట్టలో పడ్డారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలపై పడింది.

గవర్నర్‌ కోటాలో గుత్తాకు దక్కని ఎమ్మెల్సీ!

శాసనమండలి ఛైర్మన్‌గా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డిని గవర్నర్‌ కోటాలో మండలికి పంపుతారని అంతా అనుకున్నారు. ఇప్పుడు గుత్తాను కాదని వేరేవారికి అవకాశం ఇచ్చారు. మరి.. ఎమ్మెల్యే కోటాలోనైనా శాసనమండలికి పంపుతారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కొన్ని లెక్కలు తీస్తున్నారు గులాబీ నేతలు. ఆ జిల్లాలో గుత్తాతోపాటు ఎమ్మెల్సీ కోసం లాబీయింగ్‌ చేస్తున్నవారు లేకపోలేదు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు రెడ్డిలకు ఛాన్స్‌ ఇస్తారా?

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక సమయంలో టీఆర్‌ఎస్‌ నేత కోటిరెడ్డిని ఎమ్మెల్సీని చేస్తానని గులాబీ బాస్‌ ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోటిరెడ్డిలు ఒకే సామాజికవర్గం. ఒకే జిల్లా నుంచి ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరికి ఎమ్మెల్సీ ఇస్తారా అన్నది ప్రశ్నే. ఇద్దరిలో ఒకరికి పదవిస్తే… రెండోవారి పరిస్థితి ఏంటన్న ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇస్తే మాత్రం వేడి రాజుకుంటుంది. ఆ సమయానికి టీఆర్‌ఎస్‌లో ఎలాంటి సమీకరణాలు పైకి వస్తాయో తెలియదు. ఇప్పటివరకు చర్చలో ఉన్న పేర్లు కాకుండా.. కొత్త వారిని అదృష్టం వరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ భర్తీని దీనికి ఉదాహరణగా చెబుతూ .. టీఆర్‌ఎస్‌లో ఎవరూ ఓ అంచనాకు రాలేకపోతున్నారట.

Exit mobile version