అక్కడ టీడీపీకి అభిమానులు.. కార్యకర్తలు బాగానే ఉన్నారు. పార్టీని నడిపించే నాయకుడే కరువయ్యాడు. ఎవరికి బాధ్యతలు అప్పగించాలో అధినేతకు కూడా అంతు చిక్కడంలేదా .. లేక యథావిధిగా నానబెడుతున్నారా? నాయకుడు లేని పార్టీలో ఏం చెయ్యాలో కేడర్‌కు కూడా అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది?
శివరామ్‌కు బాధ్యతలు అప్పగింతపై బాబు డైలమా?
గుంటూరు జిల్లా సత్తెనపల్లి టీడీపీ చుక్కాని లేని నావలా తయారైంది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య తర్వాత నియోజకవర్గంలోని పార్టీ శ్రేణుల్లో సైలెన్స్ తప్ప మరే సందడి లేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఓడిన తర్వాత కొన్నాళ్లు కోడెల శివప్రసాదరావే సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్‌గా కొనసాగారు. కోడెల మరణం తర్వాత ఆయన కుమారుడు శివరామ్‌కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగింది. అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సొంతపార్టీ నేతలను ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలు శివరామ్‌పై ఉన్నాయి. దీంతో సత్తెనపల్లి టీడీపీ నాయకులు కొందరు పార్టీ అధినేత చంద్రబాబును కలిసి.. శివరామ్‌కు బాధ్యతలు అప్పగించవద్దని కోరారట. దీంతో చంద్రబాబు డైలమాలో పడ్డారని చెబుతారు.
బాధ్యతలు చేపట్టేందుకు రంగారావు సిద్ధంగా ఉన్నారా?
సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్ పదవికోసం మాజీ ఎంపీ, సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2019 ఎన్నికలకు ముందే సత్తెనపల్లి సీటు ఇవ్వాలని చంద్రబాబును రంగారావు కోరారు. అవసరమైతే తన కుమారుడి కోసం ఎంపీ సీటు వదిలేసుకుంటానని చంద్రబాబుకు చెప్పారు రాయపాటి సాంబశివరావు. అయితే సీటును వదులుకునేందుకు కోడెల ససేమిరా అనడంతో రంగారావు ఆశ నెరవేరలేదు. కోడెల మృతి తర్వాత రంగారావు సత్తెనపల్లిలో చాలాసార్లు పర్యటించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ ప్రచారం నిర్వహించడంతోపాటు పార్టీ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. తనకు పూర్తిస్థాయిలో పార్టీ పగ్గాలు అప్పగిస్తే సత్తెనపల్లిలో ఉంటూ టీడీపీని పటిష్టం చేసేందుకు రెడీ అని చంద్రబాబును రంగారావు కోరారు కూడా. అయితే దీనిపై చంద్రబాబు ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
బాబు చెబితే పగ్గాలు చేపడతానంటోన్న వైవీ!
అధిష్ఠానం నాన్చుడి ధోరణితో కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. ఈ సమస్య ఇలా ఉంటే మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు సడెన్ ఎంట్రీ ఇచ్చారు. 1999లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆంజనేయులు ఆ తర్వాత టీడీపీకి దూరంగా ఉన్నారు. పార్టీ కూడా ఆయన్ని పట్టించుకోలేదు. నియోజకవర్గంలో నాయకుడు లేని పరిస్థితి.. కార్యకర్తల ఇబ్బందులు చూసిన ఆంజనేయులు పునఃప్రవేశానికి పావులు కదుపుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం ఆయన ప్రచారం చేశారు. పోలింగ్ సమయంలో వైసీపీ కార్యకర్తలు ఆంజనేయులు కారుపై దాడికి దిగడం కలకలం సృష్టించింది. చంద్రబాబు ఆదేశిస్తే పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధమేనని ఆయన అభిమానులతో చెప్పినట్టుగా ప్రచారం సాగుతుంది.
సత్తెనపల్లి టీడీపీలో తారాస్థాయికి గ్రూప్ ఫైట్!
ఎన్నికల వరకు తేల్చకుండా నాన్చుతారా?
సత్తెనపల్లిలో పార్టీ ఇప్పటికే టీడీపీ గ్రూపులుగా విడిపోయింది. పార్టీ కార్యక్రమాల్లో అందరూ కలిసి పాల్గొన్న సందర్భాలు లేవనే చెప్పుకోవాలి. ఎవరికి వారే విడివిడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో రెండు పార్టీ ఆఫీసులు రన్ చేస్తున్నారంటే గ్రూపులు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సహజంగా ఇలాంటి నియోజకవర్గాల్లో నాయకత్వం అప్పగింత పనిని చంద్రబాబు అంత త్వరగా తేల్చరు. ఎవరికి పదవి ఇస్తే ఇంకెవరికి కోపం వస్తుందనే లెక్కలు వేస్తుంటారు. ఎవరికీ బాధ్యతలు ఇవ్వకుండా ఎవరికి తోచిన పనులు వాళ్లు చేస్తుంటారని ఆయన లెక్కలు వేస్తున్నారట. ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగించినా ఆశ్చర్యపోనక్కర్లేదని కేడర్ వాదన. కానీ, ఆశావహులు మాత్రం ఎవరి రేంజ్‌లో వాళ్లు నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నారు.
