ఆ నాయకుడి రాజకీయ భవిష్యత్ ఎక్కే మెట్టు దిగే మెట్టుగా మారిందా? కొత్త నిర్ణయం కలిసి వస్తుందా? ఉన్నచోట ఎందుకు ఇమడ లేకపోయారు? కొత్త పార్టీలో ఎదురయ్యే సవాళ్లేంటి? ఎవరా నాయకుడు?
కాంగ్రెస్‌లో ఎర్ర శేఖర్ కొత్త ప్రయాణం ఎలా ఉంటుంది?
బీజేపీకి పాలమూరు జిల్లాలో గట్టి షాకే తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారాయన. గతంలో సుదీర్ఘకాలం టీడీపీలో కొనసాగిన ఎర్ర శేఖర్.. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీకి తెలంగాణలో భవిష్యత్ లేదని భావించి.. బీజేపీలోకి వెళ్లినా.. అక్కడ ఇమడ లేకపోయారు. మొదటి నుంచీ అసంతృప్తే. బీజేపీలో జరిగిన కొన్ని పరిణామాలు ఆయనకు రుచించలేదు. ఇంతలో పీసీసీ చీఫ్‌గా రేవంత్ పగ్గాలు చేపట్టడంతో.. ఎర్ర శేఖర్ మనసు కాంగ్రెస్ వైపు లాగింది. రేవంత్‌తో ఉన్న పాత పరిచయాల వల్ల.. కాంగ్రెస్‌లో కలిసి ప్రయాణం చేయడానికి ఒకే చెప్పేశారు. దీంతో కాంగ్రెస్‌లో ఎర్రశేఖర్ పరిస్థితి ఏంటి? అక్కడైనా ఆయన రాజకీయ ప్రయాణం సాఫీగా ఉంటుందా? బీజేపీ కలిగే నష్టం ఏంటని రాజకీయ వర్గాలు ఆరా తీస్తున్నాయి.
ప్రాధాన్యం దక్కలేదని బీజేపీతో గ్యాప్
ఎర్ర శేఖర్ కాషాయ కండువా కప్పుకొన్న తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షుడిని చేసింది బీజేపీ. ఆ హోదాలో ఆయన రెండు మూడు కార్యక్రమాలకే హాజరయ్యారు. అయితే కాషాయ శిబిరంలోని కొందరితో పడలేదు. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ మహబూబ్‌నగర్, నారాయణపేట్ జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు జిల్లా అధ్యక్షుడునైన తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని అప్పుడే రాజీనామా ప్రకటించారు. నాడు పార్టీ పెద్దలు బుజ్జగించడంతో శాంతించినా.. ఎర్రశేఖర్‌కు బీజేపీతో గ్యాప్ పెరిగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేయలేదు.
టీఆర్‌ఎస్ నామినేటెడ్ పదవి ఆఫర్ చేసిందని ప్రచారం జరిగింది!
ఎర్ర శేఖర్ బీజేపీని వీడే టైమ్ దగ్గర పడిందని..ఆయన ఎక్కువ రోజులు కమలం శిబిరంలో ఉండబోరని దాదాపుగా అందరూ అభిప్రాయపడ్డారు. కాకపోతే టీఆర్‌ఎస్‌లోకి వెళ్తారని ప్రచారం జరిగింది. ఆయనకు నామినేటెడ్ పదవి ఆఫర్ చేశారని చెవులు కొరుక్కున్నారు. కానీ.. అధికారపార్టీలోకి కాకుండా ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్తుండటమే ఆసక్తిగా మారింది.
ఎర్ర శేఖర్ రాకతో కాంగ్రెస్ నేతల్లో గుబులు
జడ్చర్లపై అప్పుడే ఫోకస్ పెట్టారని ప్రచారం
ఎర్ర శేఖర్ తాజా ప్రకటనతో కాంగ్రెస్ శిబిరంలో గుబులు మొదలైందట. ఇప్పటికే కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా ఉన్న నాయకులు తమ పరిస్థితి ఏంటా అని ఆందోళన చెందుతున్నారట. జడ్చర్ల టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకులు.. పీసీసీ నుంచి ఎర్ర శేఖర్‌కు ఎలాంటి హామీ లభించిందో అని ఆరా తీస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో ఆయన జడ్చర్ల నుంచి పోటీ చేస్తారా లేక మహబూబ్‌నగర్‌ను ఎంచుకుంటారో అని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే బీసీ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న జడ్చర్లను ఆయన వదులుకోకపోవచ్చని తెలుస్తోంది. జడ్చర్లలో ఇల్లును అద్దెకు తీసుకుని.. పాత అనుచరులతో టచ్‌లోకి వెళ్లారట. దీంతో ఇన్నాళ్లూ జడ్చర్లలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న మల్లు రవి నాగర్ కర్నూల్ లోక్‌సభ స్థానంపై దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. మరి.. కొత్త పార్టీలో ఎర్ర శేఖర్ అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.
