Site icon NTV Telugu

కాంగ్రెస్‌ నేత ఎన్‌.రఘువీరారెడ్డి అజ్ఞాతం వీడతారా…?

మొన్నటి వరకు రెండు రాష్ట్రాల్లో ఆయన కీలక నేత. ఒకానొక సమయంలో సీఎం రేస్ వరకు వెళ్లారు. రాజకీయాలంటే బోర్‌ కొట్టిందో ఏమో సైలెంట్‌గా ఉండిపోయారు. ఒక సామాన్యుడిలా మారిన ఆయన జీవనశైలిని చూసి ఆశ్చర్యపోయారు జనం. చూస్తుండగానే రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఇప్పుడు ఢిల్లీ పెద్దల నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. మరి.. ఇకనైనా అజ్ఞాతం వీడతారా? ఎవరా నాయకుడు?

రెండున్నరేళ్లుగా నీలకంఠాపురంలోనే రఘువీరారెడ్డి!

మెరిసిన గడ్డంతో.. సామాన్య రైతులా కనిపిస్తున్న ఈయన ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎం రేస్‌లో ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ.. అది నిజం. ఈయన ఎవరో కాదు. N. రఘువీరారెడ్డి. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడుసార్లు ఎమ్మెల్యేగా.. రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. దాదాపు ఐదేళ్లపాటు ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారాయన. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిచయాలు ఉన్న నేత. రాష్ట్ర విభజన తర్వాత అనేక మంది సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు పార్టీని వీడి వెళ్లిపోయినా.. ఆయన ధైర్యం కోల్పోలేదు. 2019లో పీసీసీ చీఫ్‌ పదవికి రాజీనామా చేసి.. సొంతూరు అనంతపురం జిల్లాలోని నీలకంఠాపురానికే పరిమితం అయ్యారు రఘువీరారెడ్డి.

భార్యతో కలిసి టీవీఎస్‌ మోపెడ్‌పై వెళ్లి ఓటేశారు!

నీలకంఠాపురంలో ఆలయ నిర్మాణ బాధ్యతలు తీసుకుని కొలిక్కి తెచ్చారు. ఒకప్పుడు రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడిపిన రఘువీరారెడ్డి.. గ్రామంలో సామాన్యుడిలా మారిపోయారు. పగలంతా వ్యవసాయ పనులు.. ఆలయ నిర్మాణం తప్ప ఈ రెండేళ్లుగా ఆయనకు మరో ధ్యాస లేదు. పంచ కట్టి.. పేటా చుట్టి.. తెల్లటి గడ్డంతో టీవీఎస్‌ మోపెడ్‌ను డ్రైవ్‌ చేస్తూ కొత్త రఘువీరారెడ్డిని అభిమానులకు పరిచయం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో టీవీఎస్‌ మోపెడ్‌పై భార్యను కూర్చోబెట్టుకుని పోలింగ్‌ స్టేషన్‌కు రావడం ఆయనకే చెల్లింది. రోజూ సాయంత్రం కాగానే గ్రామంలోనే రచ్చబండ మీద కూర్చొని స్నేహితులు, గ్రామ పెద్దలతో ముచ్చటించడమే రెండేళ్లుగా ఆయన దినచర్య.

ఢిల్లీ రావాలని కాంగ్రెస్‌ పెద్దల నుంచి పిలుపు!
అనేక మంది నేతలు వచ్చి కలిసి వెళ్తున్నారు!

ఈ రెండేళ్ల కాలంలో రఘువీరారెడ్డి సంకల్పం పూర్తయింది. ఇకపై రాజకీయాల్లోకి వస్తారా అంటే.. ఆయన నుంచి ఎలాంటి సంకేతాలు లేవు. కాకపోతే ఢిల్లీకి రావాలని కాంగ్రెస్‌ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. నీలకంఠాపురంలో ఆయన పునర్మించిన ఆలయాల్లో ఈ నెల 15 వరకు హోమాలు ఉన్నాయి. మరి.. ఆయన ఢిల్లీ వెళ్తారో లేదో కానీ.. ఒక్కసారిగా రాజకీయాల్లో చర్చగా మారారు రఘువీరారెడ్డి. పొలిటికల్‌గా యాక్టివ్‌గా లేకపోయినా.. కాంగ్రెస్‌ నాయకులతోపాటు.. ఇతర పార్టీలలోని చాలా మంది వచ్చి ఆయన్ని కలిసి వెళ్తున్నారు. కాంగ్రెస్‌లో పాత మిత్రుడు.. ప్రస్తుతం టీడీపీలో ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆలయ సందర్శన కోసం రావడంతో ఇద్దరూ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాయలసీమ జలాల సాధన కోసం కలిసి పోరాడదామని కోరినా.. రఘువీరా నుంచి సమాధానం లేదని జేసీనే తెలిపారు.

ఇకనైనా రఘువీరారెడ్డి అజ్ఞాతం వీడతారా?

ఇదే సమయంలో ఢిల్లీ స్థాయిలో ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాలపై కదలిక రావడంతో అందరి దృష్టీ రఘువీరారెడ్డిపై పడింది. మరి.. ఈ సీనియర్ పొలిటీషియన్‌ అజ్ఞాతం వీడతారా? రాజకీయంగా మళ్లీ యాక్టివ్‌ అవుతారా? ఢిల్లీ పిలుపుపై ఎలా స్పందిస్తారు? అనే అంశాలపై చర్చ జరుగుతోంది. మరి.. రఘువీరారెడ్డి మనసులో ఏముందో చూడాలి.

Exit mobile version