Site icon NTV Telugu

రవాణా అధికారులపై మంత్రి పేర్ని నాని గాంధీగిరి…!

ఒక్కో నేత ఒక్కోటైపు. కొంతమంది నోటికి పని చెప్తే.. మరికొందరు మైండ్‌కి పని చెబుతారు. ఏపీలో ఓ మంత్రి రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. తన వ్యక్తిగత సిబ్బందిని అవమానించిన అధికారికి గాంధేయ పద్ధతిలో ట్రీట్‌ ఇచ్చారు ఆ మంత్రి. ఎవరో.. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

మంత్రి ఖరీదైన ప్లేట్‌మీల్స్‌పై చర్చ!

ఒక్కపూట భోజనానికి రెండున్నర వేలు. అధికారికవర్గాల్లో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌. పూట భోజనానికి రెండున్నర వేలు ఖర్చు పెట్టిన మంత్రి పేర్ని నాని గురించి రవాణశాఖలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఆ మాత్రం ఖర్చు చేయడం పెద్ద విషయం కాకున్నా.. మంత్రి తిన్న రెండున్నర వేల విలువైన ప్లేట్‌ మీల్స్‌ గురించే ప్రత్యేకంగా చెప్పుకొంటున్నారట. ఈ ఖరీదైన ప్లేట్‌మీల్స్‌పై ఈస్థాయిలో చర్చ జరగడం వెనక పెద్ద కథే నడిచిందట.

మంత్రి సెక్యూరిటీ సిబ్బంది చేతుల్లో నుంచి భోజనం ప్లేట్లను లాగేసిన రవాణా ఉద్యోగి?

కొద్దిరోజుల క్రితం రవాణాశాఖ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ నిర్వహించింది. మంత్రి హోదాలో ఆ కార్యక్రమానికి పేర్నినాని హాజరయ్యారు. మంత్రితోపాటు వ్యక్తిగత సిబ్బంది.. సెక్యూరిటీ ఉన్నారు. ఆయన వెంట ఓ అనుచరుడు కూడా వెళ్లారట. ఉన్నతాధికారులతో కలిసి మంత్రి.. మంత్రి అనుచరుడు కలిసి భోజనం చేశారు. మంత్రి గన్‌మెన్‌, వ్యక్తిగత సిబ్బంది కూడా భోజనం చేద్దామని వెళ్లగా.. వారి చేతుల్లోంచి భోజనం ప్లేట్లను లాగేసుకున్నారట రవాణాశాఖ ఉద్యోగి. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీ మీద కంప్లయింట్‌ చేస్తామని బెదిరించి.. భోజనాల దగ్గర నుంచి వెళ్లగొట్టారట ఆ ఉద్యోగి.

మంత్రి వెనక్కి వచ్చి అధికారి చేతిలో రూ. 5వేలు పెట్టారట!
కంగుతిన్న రవాణాశాఖ ఉన్నతాధికారులు!

ఆ కార్యక్రమం నుంచి వేరేచోటుకు వెళ్తున్న సమయంలో భోజనాలు చేశారా అని సిబ్బందిని అడిగారట మంత్రి పేర్ని నాని. దీంతో అక్కడ జరిగిన బాగోతాన్ని వారు మంత్రికి వెళ్లడించారట. ఆగ్రహం వ్యక్తం చేసిన పేర్ని నాని.. వెంటనే కారును వెనక్కి తిప్పమని చెప్పి తిరిగి వర్క్‌షాప్‌నకు చేరుకున్నారట. అక్కడున్న రవాణాశాఖ అధికారిని పిలిచి అతని చేతిలో 5 వేల రూపాయలు ఉంచారట మంత్రి. తాను, తన అనుచరులు లోపల భోజనం తిన్నామని.. ఆ రెండు ప్లేట్లకు కలిపి 5 వేలు తీసుకోవాలని చెప్పారట. మంత్రి అలా ఎందుకు ప్రవర్తించారో? ఎందుకు డబ్బులు ఇచ్చారో ఆ అధికారికి అర్థం కాలేదట. వెంటనే తేరుకుని ‘సార్‌… ఏమైంది?’ అని మంత్రినే అడిగారట ఆ అధికారి. తమకు భోజనాలు పెట్టింది రవాణాశాఖ అనుకున్నాం. సొంత ఖర్చుతో పెట్టారని తెలియదు. అందుకే డబ్బులు ఇస్తున్నా’ అని మంత్రి చెప్పారట. గన్‌మెన్‌ చేతుల్లోని భోజనం ప్లేట్లు లాక్కున్న సంగతిని ప్రస్తావించారట.

హడావిడి చేసిన రవాణా శాఖ ఉద్యోగి ట్రాన్స్‌ఫర్‌?

అసలు విషయం బోధపడి.. అక్కడున్న ఉన్నతాధికారులు కంగుతిన్నారట. ఆ విధంగా మంత్రిగారి ప్లేట్‌మీల్స్‌ రెండున్నర వేలు అని చర్చ మొదలైంది. ఈ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ ఏంటంటే.. భోజనాల దగ్గర హడావిడి చేసిన రవాణాశాఖ ఉద్యోగి ఇటీవలే వేరే ప్రాంతానికి బదిలీ అయ్యారట. మంత్రిగారి కోపం వల్లే ఆయన ట్రాన్స్‌ఫర్‌ అయ్యాడని టాక్‌. అయితే ఆ బదిలీకి తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఉద్యోగుల ట్రాన్సఫర్లలో జోక్యం చేసుకోబోనని మంత్రి అన్నట్టు సమాచారం. అసలు సంగతి ఎలా ఉన్నా.. ఈ భోజనాల రగడ మాత్రం.. రవాణాశాఖలో ఆ ఉద్యోగి ట్రాన్స్‌ఫర్‌కు కారణమైందనే చర్చ ఆసక్తిగా మారింది.

Exit mobile version