Site icon NTV Telugu

అనంతపురం జిల్లా మడకశిర టీడీపీలో వర్గపోరు…!

వారిద్దరూ మాజీ ప్రజాప్రతినిధులు. ఒకరు మాజీ ఎమ్మెల్యే.. ఇంకొకరు మాజీ ఎమ్మెల్సీ. ఒకే పార్టీ. ఒకే నియోజకవర్గం. నిన్న మొన్నటి వరకు కలిసే ఉన్నా.. ఇగో క్లాష్‌తో గ్యాప్‌ వచ్చింది. ఒక్కటిగా ఉన్నవారు ఇప్పుడు రెండు దుకాణాలు తెరిచారు. ఎవరి కుంపటి వారిదే. పార్టీ అధికారంలో లేకపోయినా ఓ రేంజ్‌లో అధిపత్యపోరుకు దిగుతున్న ఆ నాయకులెవరో ఈ స్టోరీలో చూద్దాం.

రెండు వర్గాలుగా చీలిన మడకశిర టీడీపీ!

అనంతపురం జిల్లా టీడీపీ వర్గవిభేదాలకు కేరాఫ్‌ అడ్రస్‌. ఇప్పటికే జిల్లాలోని రెండు మూడు నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గపోరు పీక్‌లో ఉంది. ఆ జాబితాలో మరో నియోజకవర్గం చేరింది. అదే మడకశిర. ఎస్సీ రిజర్వ్డ్‌ నియోజకవర్గమైనా ఒకప్పుడు టీడీపీదే పట్టు. అలాంటిది ఇప్పుడు మడకశిర టీడీపీ రెండుగా చీలిపోయింది. మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న ఈరన్న ఒక వర్గాన్ని లీడ్‌ చేస్తుండగా.. మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి పంచన మరో వర్గం చేరింది. పదవుల్లో ఉన్నప్పుడు ఇద్దరూ కలిసే ఉండేవారు. సీనియర్.. జూనియర్‌ అనే క్లాష్‌ రావడంతో ఇగోలు పెరిగి.. ఇద్దరి మధ్యా గ్యాప్‌ వచ్చిందట.

మడకశిరలో రెండు టీడీపీ ఆఫీస్‌లు!

గత అసెంబ్లీ ఎన్నికల వరకు సఖ్యతగా ఉన్నవారి మధ్య ఈ ఇగో క్లాష్‌ ఏంటో కేడర్‌కు అర్థం కావడం లేదట. కలిసి పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. నిరసనలు చేపడితే ఎవరి శిబిరం వారిదే. అక్కడితో ఆగితే లాభం లేదని అనుకున్నారో ఏమో.. ఈరన్న, తిప్పేస్వామిలు ఎవరికి వారుగా రెండు టీడీపీ ఆఫీసులు ఏర్పాటు చేశారట. అక్కడి కాకి ఇక్కడ వాలదన్నట్టుగా వీరి మధ్య వైరం బుస కొడుతోంది. టీడీపీ అధిష్ఠానం ఏదైనా కార్యక్రమానికి పిలుపిస్తే.. రెండు వర్గాలు వాటిని ఆచరణలో పెడతాయి కానీ.. వేర్వేరుగా రోడ్డెక్కడం.. ఎవరి నినాదాలు వారివే అన్నట్టుగా నిరసనలు కనిపిస్తాయి.

ఇగోలతో దూరం పెరిగిందా?

అసలు రాజకీయాలు యాక్టీవ్‌గా లేనిచోట.. ఇద్దరు టీడీపీ నేతల వైఖరి కేడర్‌ను ఆశ్చర్యపరుస్తోంది. స్నేహంగా కలిసిమెలిసిన తిరిగింది వీళ్లేనా అన్నంతగా పగ పెంచేసుకున్నారట. ఎంత ఫ్రెండ్స్‌ అయినా పెత్తనం చేస్తే ఊరుకొంటారా? తిప్పేస్వామి కొంచెం స్పీడ్‌ అయ్యారనేది ఈరన్న ఫీలింగ్‌. తను ఉండగా.. ఓవర్‌టేక్‌ చేయాల్సిన అవసరం ఏంటని ఈరన్న ఫీలవుతున్నారట. తిప్పేస్వామి ఏం చేసినా.. ఎంత చేసినా? రిజర్వేషన్‌ మారదు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఆయన అవకాశం దక్కదు కదా అంటున్నారట. ఈ పాయింట్‌ కూడా ఈరన్న, తిప్పేస్వామి మధ్య గ్యాప్‌ రావడానికి కారణంగా చెబుతున్నారు.

ఫలించని సయోధ్య ప్రయత్నాలు!

ఇలా ఎవరికివారుగా ఉంటే టీడీపీ బలహీన పడుతుందని భావించిన హిందూపురం పార్లమెంట్‌ తెలుగుదేశం అధ్యక్షుడు బీకే పార్థసారథి ఇద్దరి మధ్య సయోధ్యకు యత్నించారు. అయినా ఈరన్న, తిప్పేస్వామి వైఖరిల్లో మార్పు లేదట. దీంతో పార్టీ కోసమే పనిచేసే కార్యకర్తలకు ఎవరి పక్షాన ఉండాలో అర్థం కావడం లేదు. మరి.. ఈ మిత్ర భేదాన్ని పార్టీ పెద్దలు ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి.

Exit mobile version