Site icon NTV Telugu

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌లో కొత్త చిచ్చు…!

ఒకే పార్టీలో ఉన్నారు.. ఒకే జిల్లా నాయకులు. కానీ.. నేతలిద్దరూ తూర్పు-పడమర. మాట మాట్లాడితే ఉప్పు-నిప్పులా ఉంటుంది యవ్వారం. ఆధిపత్యం కోసం ఎత్తులు.. పైఎత్తులు వేస్తున్న సమయంలో కొత్త రగడ తెరపైకి వచ్చింది. అదే ఇప్పుడు కాంగ్రెస్‌లో చర్చ. వారెవరో ఈ స్టోరీలో చూద్దాం.

ఇంద్రవెల్లి సభ కాంగ్రెస్‌ నేతల మధ్య పాత పగలు.. సెగలు రాజేసిందా?

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌లో ఇంద్రవెల్లి సభ చిచ్చు పెట్టడంతో పార్టీలో అందరి దృష్టీ.. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి.. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావులపై పడింది. జిల్లా కాంగ్రెస్‌లో ఇద్దరూ తూర్పు-పడమరలా ఉండటమే దీనికి కారణం. మహేశ్వర్‌రెడ్డి ప్రస్తుతం AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌. ప్రేమ్‌సాగర్‌రావు పీసీసీలో పెద్దపదవి కోసం లాబీయింగ్‌ చేస్తున్నారు. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ రాజకీయాలను ప్రేమ్‌సాగర్‌రావు శాసించేవారు. అప్పట్లోనే మాజీ మంత్రి రామచందర్‌రెడ్డికి ఆయనకు పడేదీ కాదు. పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో విలీనమైన తర్వాత మాజీ మంత్రి రాంచందర్‌రెడ్డి పాత్ర తీసుకున్నారు మహేశ్వర్‌రెడ్డి. ఈ మాజీ ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడైన తర్వాత ఆధిపత్యపోరు ఇంకా రాజుకుంది. అధిష్ఠానం దగ్గర ఎవరి లాబీయింగ్‌ వాళ్లదే. హైకమాండ్‌ పెద్దలను జిల్లాకు తీసుకురావడం.. పార్టీలో పట్టు నిరూపించుకోవడం కామనైపోయింది. అలాంటి నాయకుల మధ్య ఇప్పుడు ఇంద్రవెల్లి సభ పాత గొడవలను మళ్లీ రాజేసినట్టు అయ్యింది.

మొన్నటి ఎన్నికల్లో ఒకరిపై ఒకరు ఎత్తుగడలు!

గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రేమ్‌సాగర్‌రావుకు మంచిర్యాల కాంగ్రెస్‌ టికెట్‌ రాకుండా పార్టీలో ఓ వర్గం తీవ్రంగా ప్రయత్నించిందట. ఆ ముఠా వెనక మహేశ్వర్‌రెడ్డి ఉన్నట్టు అనుమానిస్తోంది మాజీ ఎమ్మెల్సీ వర్గం. ఆ ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయారు. అయితే ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు వెనక ప్రేమ్‌సాగర్‌రావు చక్రం తిప్పారట. ఆ విధంగా మాజీ ఎమ్మెల్సీ సామర్థ్యం ఢిల్లీ వరకు తెలిసిందని చెబుతారు. ఇంతలో మహేశ్వర్‌రెడ్డికి పార్టీలో పెద్ద పదవిరావడంతో నిరుత్సాహంలో ఉన్న మాజీ ఎమ్మెల్సీని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి దన్నుగా నిలిచారు. ఈ ప్రయత్నం పాత పగలు కొత్తగా సెగలు రేపడానికి కారణమైనట్టు పార్టీ వర్గాలు చెప్పుకొంటాయి.

సయోధ్య కోసం ఇంద్రవెల్లి దండోరా ప్రకటన.. బెడిసికొట్టిందా?

రెండు వర్గాల మధ్య సయోధ్య కోసం రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి దండోరాపై ప్రకటన చేసినా.. అది వికటించింది. పీసీసీ చీఫ్‌ ప్రకటనపై మహేశ్వర్‌రెడ్డి అలిగారు. పైగా ప్రేమ్‌సాగర్‌రావుకు దండోరా బాధ్యతలు అప్పగించడంతో పుండుమీద కారం జల్లినట్టుగా ఫీలవుతున్నారట మాజీ ఎమ్మెల్యే. జిల్లాలో పార్టీ తన చేతిల్లో నుంచి పోతుందనే భావనలో ఉన్నారట. వాస్తవానికి రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత నిర్మల్‌లోనే తొలి పర్యటన చేశారు. పార్టీ పరంగా ఆ టూర్‌ సక్సెస్‌ అయిందని చర్చ జరుగుతున్న సమయంలోనే ఇంద్రవెల్లి సభ రచ్చ రచ్చ లేపుతోంది. ఈ సమస్యకు ఆది తెలిసినా.. అంతం ఎక్కడో కాంగ్రెస్‌ నేతలకు అంతుచిక్కడం లేదట. దశాబ్దాలుగా ఆధిపత్యపోరుతో ఒకరిపై ఒకరు పైచెయ్యి సాధించేందుకు పావులు కదుపుతున్న నేతల మధ్య సయోధ్య సాధ్యమేనా అనే అనుమానాలు ఉన్నాయి. మరి.. ఈ రగడ రానున్న రోజుల్లో ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Exit mobile version