NTV Telugu Site icon

మనసున్న మనిషి… సోనూ సూద్!

తెరపై కనిపించేదంతా నిజం కాదు అని సినిమాలు చూసే జనానికి తెలుసు. కానీ, తాము అభిమానించే నటీనటులు కనబరిచే అభినయానికి ఫిదా అయిపోతూ, ఈలలు కేకలు వేసి ఆనందిస్తుంటారు. అలాగే తెరపై కరడుగట్టిన హృదయం ఉన్న విలన్ గా నటించేవారికి, నిజజీవితంలో కరుణ చూపే తత్వం ఉంటుందని తెలిసినప్పుడూ జనం అదే తీరున స్పందిస్తూ ఉన్నారు. అనేక చిత్రాలలో ప్రతినాయకునిగా పలకరించి, భయపెట్టిన సోనూ సూద్ నిజజీవితంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఇదిగో నేనున్నానంటూ ముందడుగు వేస్తున్నారు. ముఖ్యంగా కరోనా కల్లోల సమయంలో ఎంతోమందిని సోనూ ఆదుకున్న తీరు చూసి, తెరపై ఆయనను చూసి జడుసుకున్నవారే పులకించి పోతూ అభినందనలు తెలుపుతున్నారు. తనకున్న పరిధిలో సోనూ సూద్ అనితరసాధ్యంగా సాయం అందించడంపై అందరూ ఆయన కరుణరస హృదయానికి జేజేలు పలుకుతున్నారు. ‘తెరపై విలన్… రియల్ లైఫ్ హీరో…’ అంటూ కితాబు నిస్తున్నారు. ఆయన మంచితనం చూసిన తరువాత రచయితలు సైతం తమ పంథా మార్చుకొని సోనూ కోసం కొత్త స్క్రిప్టులు రాయడానికి సిద్ధమయ్యారంటేనే అతనికి ఎలాంటి ఫాలోయింగ్ ఏర్పడిందో ఊహించవచ్చు. సోనూ చేసిన మంచిపనులకు చిత్రసీమలోని ప్రముఖులు సైతం అభినందనల వర్షం కురిపించారు. ఇక ప్రభుత్వాలు సైతం ఆయనకు ఎర్రతివాచీ పరచి గౌరవించాయి.

పంజాబ్ లోని మోగాలో 1973 జూలై 30న జన్మించిన సోనూ సూద్ ‘శాక్రిడ్ హార్ట్ స్కూల్’లో చదివి, తరువాత నాగపూర్ లో ఇంజనీరింగ్ చేశారు. చదువు పూర్తయిన దగ్గర నుంచీ సోనూ సూద్ కు సినిమాలపైనే మనసు మళ్ళింది. ఆ క్రమంలో మోడల్ గా నటించారు. అందివచ్చిన పాత్రనల్లా అంగీకరించారు. ఆరంభంలో తమిళ చిత్రాలలో నటించారు. నాగార్జున నిర్మించి, నటించిన ‘సూపర్’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. అంతకు ముందే కొన్ని అనువాద చిత్రాల ద్వారా సోనూ తెలుగుజనానికి పరిచయమే. అంతేకాదు, ఆయనకు తెలుగువారితో ముందు నుంచీ బంధం ఉంది. 1996లోనే తెలుగమ్మాయి సోనాలీని పెళ్ళాడారు. వారికి అయాన్, ఇషాంత్ అనే ఇద్దరు అబ్బాయిలు. సోనూ ఆరంభం నుంచీ క్రమశిక్షణకు ప్రాణం ఇచ్చే మనిషి. తన శరీరసౌష్టవాన్ని చక్కగా రూపొందించుకోవడానికీ ఆయన శ్రమిస్తారు. సొంతవూరిలో జిమ్ పెట్టి, అక్కడి యువతలో దేహదారుఢ్యం పట్ల ఆసక్తి నెలకొల్పారు. ఊరిలో కూడా కష్టంలో ఉన్నవారికి చేతనైన సాయం అందించేవారు. చిత్రసీమలో ప్రవేశించిన తరువాత తన సంపాదనను వృథా పోనివ్వకుండా పొలాలు కొంటూ ఆస్తులు పోగేశారు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ 150 కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. ఆయన కంటే చిత్రసీమలో కోట్ల రూపాయలు సంపాదించేవారు ఎందరో ఉన్నారు. అయినా, తనకున్న దానిలోనే ఇతరులకు సాయం చేసే సోనూ సూద్ మంచిమనసును అందరూ అభినందిస్తున్నారు. దేశవ్యాప్తంగా తన దృష్టికి వచ్చిన కష్టజీవులకు కరుణతో సహాయం అందించారు. అందుకోసం ‘సూద్ ఛారిటీ’ నెలకొల్పారు. సోనూ మంచి మనసు చూసి, ఆయన ఛారిటీకి కొందరు దాతలు విరాళాలు ఇచ్చారు. అయినా సాయం చేసే మంచి మనసు అందరికీ ఉండాలి కదా! దేశంలో ఫస్ట్ లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది వలస కూలీలు కష్టాల పాలయ్యారు. వారిని చూసి చలించిన సోనూ సూద్ వారి వారి గ్రామాలకు చేరడానికి ఎంతో సహాయం చేశారు. అలాగే కిర్జిస్థాన్ లో చిక్కుకు పోయిన 1500 మంది విద్యార్థులను రప్పించడానికి ఛార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆదుకున్నారు. కష్టాల్లో ఉన్న ఓ రైతు కుటుంబానికి ట్రాక్టర్ కొనిచ్చారు.

యుపిఎస్సీ పరీక్షలకు వెళ్లాలనుకొనే ఆర్థిక స్తోమత లేనివారికి సరైన శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇలా పలు సేవాకార్యక్రమాలు చేస్తూ సాగిపోతున్న సోనూ సూద్ కు దేశవ్యాప్తంగా అగణిత అభిమానగణాలు వెలిశాయి. ప్రస్తుతం ఆయన చిరంజీవి ‘ఆచార్య’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళ చిత్రం ‘తమిళరసన్’లోనూ, హిందీ సినిమా ‘పృథ్వీరాజ్’లోనూ ఆయన నటిస్తున్నారు. సోనూ సూద్ కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఎందరో ఆయన హీరోగా సినిమాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరి అంగీకరించిన చిత్రాలు పూర్తయిన తరువాత సోనూ సూద్ హీరోగా సినిమాలు వరుసగా జనం ముందుకు వస్తాయేమో చూద్దాం.