ఈ యేడాది ‘శ్రీకారం’తో జనం ముందుకు వచ్చిన శర్వానంద్ చేతిలో ఏకంగా మూడు చిత్రాలు ఉన్నాయి. అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’ మూవీలో నటిస్తున్న శర్వానంద్, కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ చిత్రానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటితో పాటే అతను నటిస్తున్న ద్విభాషా చిత్రం ఒకటి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. శ్రీకార్తీక్ దర్శకత్వంలో ఎస్.ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఒకే ఒక జీవితం’ అనే టైటిల్ ఖరారు చేశారు. శర్వానంద్ సరసన రీతువర్మ నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అమల అక్కినేని, ప్రియదర్శి, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తొలిదశ లాక్ డౌన్ కంటే ముందే సెట్స్ పైకి వెళ్ళిన ఈ సినిమా చివరి షెడ్యూల్ గత యేడాది అక్టోబర్ లో జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. శర్వానంద్ నటిస్తున్న ఈ 30వ చిత్రానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ మాటలు రాస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఇదే నిర్మాతలు రెండేళ్ళ క్రితం ‘ఖైదీ’ లాంటి బ్లాక్ బస్టర్ ను అందించడం విశేషం.
‘ఒకే ఒక జీవితం’ అంటున్న శర్వానంద్!
