Site icon NTV Telugu

ఆర్బీఐ గవర్నర్‌గా మరో మూడేళ్లు ఆయనే.. కేంద్రం నిర్ణయం

కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్‌నే కొనసాగించాలని నిర్ణయానికి వచ్చింది.. ఆయన పదవీ కాలాన్ని మరో మూడేళ్లు పొడిగించింది ప్రభుత్వం.. శక్తికాంత దాస్ పునర్‌నియామకాన్ని కేబినెట్ పునర్నియామక కమిటీ ఆమోదించింది. కాగా, ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న శక్తికాంత్ దాస్‌ పదవి కాలం ఈ ఏడాది డిసెంబర్‌ 10 తేదీతో ముగిసిపోనుంది.. కానీ, ఆయనను కొనసాగించాలనే ఆలోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం.. ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో.. మరో మూడేళ్లపాటు లేదా కేంద్రం ఇచ్చే తదుపరి ఆదేశాల వరకు ఆయననే ఆర్బీఐ గవర్నర్‌ పదవిలో కొనసాగనున్నారు.

Read Also: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్జీటీ బ్రేక్‌..!

అప్పటి వరకు ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న ఉర్జిత్‌ పటేల్‌.. 2018లో రాజీనామా చేసిన తర్వాత.. ఆ బాధ్యతలను స్వీకరించారు శక్తికాంత దాస్.. ఓవైపు కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న సమయంలోనూ.. సంక్షోభం తలత్తెకుండా దాస్‌ ఆ సమస్యను పరిష్కరించేందుకు కీలక చర్యలు చేపట్టారు.. దీంతో.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా ఆపగలిగి విజయం సాధించారు.. వడ్డీరేట్లను తగ్గిస్తూ ద్రవ్యపరపతి విధానంలో సర్దుబాటు వైఖరిని కొనసాగించిన ఆయన.. ప్రభుత్వ ఉద్దీపనలతో పాటు ఆర్‌బీఐ తరఫున ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకున్నారు.. ముఖ్యంగా కరోనా మహమ్మారి కట్టడికి లాక్‌డౌన్‌ విధించిన సమయంలో.. లోన్ మారటోరియం మంచి ఫలితాలను ఇచ్చింది. కరోనా నుంచి కోలుకున్న ఆర్థిక రంగం గాడిలోకి పడుతోన్న సమయంలో.. శక్తికాంత దాస్‌ను కొనసాగించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

Exit mobile version