Site icon NTV Telugu

అంబానీ ఇంటి దగ్గర అదనపు సెక్యూరిటీ.. ఒకే ఫోన్‌ కాల్‌తో అలెర్ట్..!

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీకి చెందిన ముంబైలోని నివాసంలో కలకలం రేగింది. ఆయన నివాసానికి అనుమానాస్పద ఫోన్ కాల్స్ రావ‌డంతో అప్రమ‌త్తం అయిన పోలీసులు.. అంబానీ ఇంటి దగ్గర భ‌ద్రతను క‌ట్టుదిట్టం చేశారు. అయితే, ముంబైలోని ముకేష్‌ అంబానీ నివాసం అంటిల్లాకు ఈ రోజు అనుమానాస్పద ఫోన్ కాల్ వ‌చ్చింది. ఆ కాల్ చేసిన వ్యక్తి ట్యాక్సీ డ్రైవ‌ర్ అని తేలింది. ఇక, ఇద్దరు వ్యక్తులు ముకేష్‌ అంబానీ ఇంటికి బ్యాగ్ తీసుకెళ్లాల‌ని కోరార‌ని ఆ ట్యాక్సీ డైవ‌ర్ పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు టాక్సీ డ్రైవర్‌ ఫోన్‌ కాల్స్‌పై ఆరా తీస్తున్నారు పోలీసులు.. మా ట్యాక్సీ డ్రైవ‌ర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.. ఇద్దరు వ్యక్తులు ముకేష్‌ అంబానీ నివాసానికి బ్యాగ్ తీసుకెళ్లాల‌ని కోరారని ఆ డ్రైవ‌ర్ మా ద‌ర్యాప్తులో చెప్పాడని ముంబై పోలీసులు వెల్లడించారు.. దీంతో.. అంబానీ ఇంటి వ‌ద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.. డీసీపీ స్థాయి అధికారితో అంబానీ ఇంటి వ‌ద్ద ప‌రిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు..

ముకేష్‌ అంబానీ అంటిల్లా నివాసం చుట్టూ అదనపు బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతను పెంచారు పోలీసులు… సీసీటీవీలతో నిఘా పెంచారు… ముంబైలో ఇద్దరు వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు ఇద్దరు అనుమానితులను విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది.. అంబానీ నివాసం దగ్గర పోలీసు కమాండోలతో పాటు అదనపు బలగాలను మోహరించారు. కాగా, గతంలో అంబానీ నివాసానికి బాంబు బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి మాజీ పోలీసు అధికారి సచిన్ వాజ్‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరోసారి ఫోన్‌ కాల్స్‌తో ముంబై పోలీసులు అప్రమత్తం అయ్యారు.

Exit mobile version