(జూలై 4 సత్యదేవ్ బర్త్ డే సందర్భంగా…)
వైజాగ్ లో పుట్టి, విజయనగరంలో ఇంజనీరింగ్ చదివి, బెంగళూర్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేసి… హైదరాబాద్ లో నటుడిగా స్థిరపడ్డాడు సత్యదేవ్. అందరిలా అతను కేవలం నటుడు కాదు… విలక్షణ పాత్రలు చేస్తున్న సలక్షణ నటుడు. జూలై 4, 1989లో పుట్టిన సత్యదేవ్ ఇవాళ 33వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు.
నటుడు కావాలనే కోరికతో తీవ్రమైన ప్రయత్నాలు చేసి, ఒకటి రెండు సినిమాల్లో ఇలా కనిపించి అలా మాయమైనా… అతనిలోని ఆర్టిస్ట్ ను గుర్తించి, ప్రోత్సహించి, చిత్రసీమలో నిలబెట్టేందుకు కృషి చేసిన మిత్రులు సత్యదేవ్ కు చాలానే ఉన్నారు. వారి కారణంగానే ‘మైనే ప్యార్ కియా, ముకుంద, అసుర’ వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు సత్యదేవ్. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సత్యదేవ్ నటించిన ‘జ్యోతిలక్ష్మీ’ అతని తలరాతను మార్చేసింది. ‘ఇంత చక్కని ప్రతిభ ఉన్న నటుడు తెలుగులో మన మధ్యే ఉన్నాడా?’ అని రామ్ గోపాల్ వర్మ సైతం ఆశ్చర్యపోయేలా చేశాడు సత్యదేవ్. ‘జ్యోతిలక్ష్మీ’లో సత్యదేవ్ నటనను చూసిన జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ తాను దర్శకత్వం వహించిన ‘మనవూరి రామాయణం’లో కీలక పాత్ర చేయించారు. ‘ఘాజీ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్ ఆ తర్వాత ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’లో నటించాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’లోనూ నటించబోతున్నాడు.
తమిళ చిత్రం ‘చతురంగ వేట్టై’ తెలుగు రీమేక్ ‘బ్లఫ్ మాస్టర్’లో నటించాడు సత్యదేవ్. ఈ సినిమా నటుడిగా సత్యదేవ్ ను మరో స్థాయికి తీసుకెళ్ళింది. అక్కడ నుండి వైవిధ్యమైన కథాంశాలను తెరకెక్కించాలని భావించిన దర్శకులకు సత్యదేవ్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఓ పక్క హీరోగా నటిస్తూనే మరో పక్క ప్రాధాన్యమున్న ఏ పాత్ర తన దరికి చేరినా అక్కున చేర్చుకుని ప్రాణం పోశాడు. ‘అంతరిక్షం’ సినిమాలో ద్విపాత్రాభినయం చేసి మెప్పించాడు. ఇక కరోనా సమయంలో థియేటర్లు మూత పడినప్పుడు సత్యదేవ్ తెలుగు ఓటీటీ హీరోగా మారిపోయాడు. అతను నటించిన మూడు సినిమాలు, మూడు వేర్వేరు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అయ్యాయి. ’47 డేస్’ (జీ 5), ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ (నెట్ ఫ్లిక్స్), ‘గువ్వ గోరింక’ (అమెజాన్ ప్రైమ్)లో విడుదలయ్యాయి. అలానే నెట్ ఫ్లిక్స్ లోనే వచ్చిన ‘పిట్ట కథలు’ ఆంథాలజీలోనూ సత్యదేవ్ నటించాడు. ఇక ఆహాలో వచ్చిన ‘లాక్డ్’, జీ 5లో వచ్చిన ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’ వెబ్ సీరిస్ లోనూ సత్యదేవ్ చేశాడు. అంతేకాదు… తన వాచకంతోనూ ప్రముఖుల దృష్టిలో పడ్డాడు. ‘నవాబ్’ చిత్రంలో శింబుకు, ‘సాహో’లో నీల్ నితిన్ కు, ఇటీవల ‘ఆకాశం నీ హద్దురా’ మూవీలో హీరో సూర్యకు డబ్బింగ్ చెప్పింది సత్యదేవే!
సత్యదేవ్ ప్రస్తుతం ‘గుర్తుందా శీతాకాలం’ మూవీలో నటిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా ఇందులో హీరోయిన్. కన్నడ చిత్రం ‘లవ్ మాక్ టైల్’కు ఇది రీమేక్. దీనితో పాటు ‘తిమ్మరుసు’, ‘గాడ్సే’ చిత్రాలలోనూ నటిస్తున్నాడు. ‘తిమ్మరుసు’ చిత్రంలో ప్రియాంక జువాల్కర్ నాయిక కాగా శరణ్ గోపిశెట్టి దర్శకుడు. ఇక సత్యదేవ్ తో ‘బ్లఫ్ మాస్టర్’ తీసిన గోపీ గణేశ్ తాజాగా ‘గాడ్సే’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి సి. కళ్యాణ్ నిర్మాత. సత్యదేవ్ ఊ అనాలే కానీ అతనితో సినిమాలు తీసే నిర్మాతలు బాగానే ఉన్నారు. అయితే… ఇంతవరకూ కష్టపడి సంపాదించుకున్న పేరును నిలబెట్టుకోవాలని ఈ యువ నటుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. స్వీయ ప్రతిభతో చిత్రసీమలో తారాజువ్వలా దూసుకుపోతున్న సత్యదేవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ, మరిన్ని భిన్నమైన పాత్రలు అతను పోషించాలని ఆకాంక్షిద్దాం.