సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగను తెలుగురాష్ట్రాల్లో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ వచ్చిదంటే చాలు.. ఘుమఘుమలాడే పిండివంటలు, పిల్లల ఆటపాట, గాలిపటాల హుషారుతో ఇళ్లంతా కోలాహలంగా మారిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తెలుగింటి లోగిళ్లు రంగవల్లులతో దర్శనమిస్తున్నాయి.
ఉదయాన్నే లేచేసరికి చలిగాలి పలకరింపుతో పులకరించి, పుణ్యస్నానాలచరించి కొత్తబట్టలు వేసుకొని చిన్నాపెద్దా తేడాలేకుండా హుషారుగా గాలిపటాలు ఎగురవేస్తూ సంక్రాంతి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. మహిళలు ఉదయాన్నే ఇంటిముందు భూమాతను రంగవల్లులతో అలంకరించి, పిండివంటల్లో నిమగ్నమవుతున్నారు. తెలుగురాష్ట్రాల్లో వివిధ రంగులతో వేసిన ముగ్గులతో భూమాత గోరింటాకు పెట్టుకుందా అనే విధంగా కనువిందుచేస్తోంది. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో సందడి వాతావరణం నెలకొంది. ఇక ఏపీలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కోడి పందాలతో కాయ్‌రాజాకాయ్ అంటూ బెట్టింగ్ రాయళ్లు ఊపుమీదున్నారు.
