NTV Telugu Site icon

వారికి రూ.25లక్షలు, ఇంటికో ఉద్యోగం : మంత్రి కన్నబాబు

ఏపీలో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఏపీలో కురిసిన భారీ వర్షాలపై మాట్లాడారు. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయని, చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వరద ప్రభావం అధికంగా ఉందన్నారు. వరదలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. సీఎం జగన్‌ ఎప్పటికప్పుడు అధికారులకు ప్రత్యేక సూచనలు చేస్తున్నారన్నారు.

ఇప్పటివరకు వరదల్లో 34 మంది మృతి చెందారని, 10 మంది గల్లంతయ్యారని వెల్లడించారు. మృతి చెందిన వారిలో 3గురు రెస్య్కూ అపరేషన్‌ సిబ్బంది ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వరద కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ఒక్కొక్కరికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటికే చనిపోయిన వారికి 90శాతం ఎక్స్‌గ్రేషియా అందిచామన్నారు. అంతేకాకుండా 8లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు ఆయన తెలిపారు.

అంతేకాకుండా తక్షణ సహాయం కోసం కలెక్టర్ల వద్ద ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కడప, చిత్తూరు, నెల్లూరు కలెక్టర్ల వద్ద రూ.10 కోట్ల చొప్పున, అనంతపురం కలెక్టర్‌ వద్ద రూ.5 కోట్ల చొప్పున నిధులను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. వీటితో పాటు వరద సహాయక విధినిర్వాహణలో మరణించిన కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సహాయంతో పాటు ఒకరికి ఉద్యోగం కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు.