Site icon NTV Telugu

పైపైకి పెట్రోల్‌, డీజిల్‌.. సామాన్యుడి జేబుకు చిల్లే..!

రోజురోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరిస్తున్నాయి. ఇప్పటికే సెంచరీ కొట్టి నాటౌట్‌తో ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ మరోసారి పరుగులు తీశాయి. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 41 పైసల, లీటర్‌ డీజిల్‌పై 42పైసలు పెరిగాయి. దీంతో ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 114.13 లకు చేరకుంది. దీనితో పాటు లీటర్‌ డీజిల్‌ ధర రూ. 107.40ల వద్ద ఉంది.

ఇప్పటి వరకు రోజూ 30 పైసల మీద పెంచిన ఇంధన ధరలు.. ఒకేసారి 40 పైసల మీద పెరగడంతో వాహనదారులు షాక్‌కు గురయ్యారు. ఇలాగే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూపోతే ఇంధన బైక్‌ల వాడకం పక్కనపెట్టేయాలంటూ కొందరు వాహనదారులు ముచ్చటించుకుంటున్నారు. ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ నిర్ణయం తీసుకోవాలంటూ వాహనదారులు కోరుతున్నారు.

ఇదిలా ఉంటే నేటి నుంచి గ్యాస్‌ ధరలు కూడా పెరుగనున్నాయి. రోజురోజుకు నిత్యావసర సరుకుల ధరలు పైపైకి పోవడంతో ‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు’ అనే విధంగా పరిస్థితి నెలకొందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version