2021 ఏడాది మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ తర్వాత ప్రజలు ఎక్కువ చర్చించుకున్నది… ఇబ్బంది పడింది పెట్రోల్ ధరల విషయంలోనే. ఎందుకంటే దేశంలో ఈ ఏడాది లీటర్ పెట్రోల్ ధర తొలిసారిగా రూ.100 దాటింది. ప్రస్తుతం దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇది రూ.100పైనే ఉంది. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలకు దేశీయ సుంకాలు తోడవడంతో సామాన్యుడు పెట్రోల్ ధరల సుడిగుండంలో చిక్కుకున్నాడు.
ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.87.02గా నమోదు కాగా క్రమంగా ఈ ధర పెరుగుతూ వెళ్లింది. ఫిబ్రవరిలో గరిష్టంగా రూ.89.75 రేటును తాకింది. మార్చిలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.77కి చేరింది. ఏప్రిల్, మే నెలల్లో పెట్రోల్ ధర స్వల్పంగా తగ్గింది. ఏప్రిల్‌లో రూ.94.14కి తగ్గగా… మే నెలలో రూ.93.77 గరిష్ట ధర పలికింది. జూన్‌లో మళ్లీ పెరిగి రూ.98.27కి చేరింది. జూలైలో తొలిసారిగా సెంచరీ మార్కును దాటేసింది. జూలైలో లీటర్ పెట్రోల్ రూ.102.75కి చేరింది. ఆగస్టులో రూ.105.60, సెప్టెంబర్‌లో రూ.105.71, అక్టోబరులో రూ.113.68కి పెట్రోల్ ధర ఎగబాకింది.
Read Also: కొత్త ఏడాదిలోనూ ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
అయితే దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో పాటు పలు రాష్ట్రాలలో ఉప ఎన్నికలు ఉండటంతో మోదీ సర్కారు దిద్దుబాటు చర్యలను చేపట్టింది. దీపావళి సందర్భంగా కేంద్రం పెట్రోలుపై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకం తగ్గించింది. ఆ తర్వాత పలు రాష్ట్రాలు కూడా ఈ కోవలో సుంకాలు తగ్గించినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సామాన్యుడికి తగ్గింపు ఊరట లభించలేదు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది.
